భద్రత, ఆర్థిక ముప్పులపై దృష్టి సారించండి

సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలు ఏళ్లపాటు అనేక అంశాలను భుజాలపై వేసుకుని ముందుకు సాగలేక పోయాయని, ఏవి ముఖ్యమో వాటినే అవి ఎంచుకుని పని చేయడం ద్వారా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని, దేశ భద్రతకు, ఆర్థిక ఆరోగ్యానికి, ప్రజా భద్రతకు ప్రమాదకరమైన నేరాలపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పిలుపునిచ్చారు.

Published : 02 Apr 2024 05:10 IST

వ్యక్తిగత గోప్యతను గౌరవించాలి  
దర్యాప్తు సంస్థలకు సీజేఐ సూచన

దిల్లీ: సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలు ఏళ్లపాటు అనేక అంశాలను భుజాలపై వేసుకుని ముందుకు సాగలేక పోయాయని, ఏవి ముఖ్యమో వాటినే అవి ఎంచుకుని పని చేయడం ద్వారా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని, దేశ భద్రతకు, ఆర్థిక ఆరోగ్యానికి, ప్రజా భద్రతకు ప్రమాదకరమైన నేరాలపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పిలుపునిచ్చారు. సోదాల సందర్భంగా అవసరం లేకపోయినా వ్యక్తిగత వస్తువులను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకుంటున్న సంఘటనలు చోటుచేసుకోవడంపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు అనివార్యతలు, వ్యక్తిగత గోప్యత హక్కుల మధ్య సమతౌల్యం ఉండాలని సూచించారు. సోమవారం దిల్లీలో ఆయన సీబీఐ మొదటి డైరెక్టర్‌ డీపీ కోహ్లి 20వ స్మారకోపన్యాసమిచ్చారు. సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలు నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన సోదాలు, జప్తుల సందర్భంగా సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత గోప్యత హక్కు అనేది పారదర్శకతకు మూల స్తంభం లాంటిదని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల్లో సిబ్బంది పరిమితంగా ఉంటారని, అపరిమిత కేసులను చేపట్టడం వారికి పెద్ద సవాలేనని అభిప్రాయపడ్డారు. సీబీఐలో చాలా మంది డిప్యుటేషన్‌పై పని చేస్తున్న వారేనని డైరెక్టర్‌ తనకు తెలిపారని వివరించారు. కోర్టులతోపాటు సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలనూ క్రమబద్ధీకరించాల్సి ఉందని పేర్కొన్నారు. కొత్తగా తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టాలు న్యాయ వ్యవస్థను ఆధునికీకరించడంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. టెక్నాలజీలను వినియోగించుకుని దర్యాప్తు సంస్థలు సామర్థ్యాలను పెంచుకోవాలని, కోర్టు ప్రొసీడింగ్స్‌తో అనుసంధానించుకుని సమయ నిర్దేశిత ప్రాసిక్యూషన్లను చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని