కాంగ్రెస్‌పై నిర్బంధ చర్యలు తీసుకోం

ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ వరసగా పంపిస్తున్న నోటీసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Published : 02 Apr 2024 05:10 IST

 సుప్రీంకోర్టుకు తెలిపిన ఆదాయపు పన్ను శాఖ
లోక్‌సభ ఎన్నికల ముందు హస్తం పార్టీకి ఊరట

దిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ వరసగా పంపిస్తున్న నోటీసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.  పన్ను బకాయిలు రాబట్టేందుకు ప్రస్తుతం ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోబోమని ఐటీ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. నోటీసులను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మార్చిలో వేర్వేరు తేదీల్లో డిమాండ్‌ నోటీసులు ఇచ్చినమాట వాస్తవమేనని, కోర్టులో తుదితీర్పు వెలువడేవరకు ఆకస్మిక చర్యలేవీ తీసుకోబోమని ఐటీ శాఖ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తొలుత తెలిపారు. ‘పిటిషనర్‌ ఒక రాజకీయ పార్టీ. 2016లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రూ.1,700 కోట్ల పన్నుకు 2021లో ఐటీ శాఖ డిమాండ్‌ నోటీసు ఇచ్చింది. 20% మొత్తం చెల్లించేందుకు అవకాశమిచ్చినా కట్టకపోవడంతో రూ.135 కోట్లను ఇటీవల రాబట్టుకున్నాం. సుమారు రూ.1,700 కోట్లకు డిమాండ్‌ లేవనెత్తాం. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందువల్ల ఏ పార్టీకీ ఏ విధంగానూ సమస్యలు తీసుకురాకూడదని భావిస్తున్నాం. ఎన్నికల తర్వాత విచారణ జరిగేవరకు ఈ పన్ను బకాయి వసూలుకు ఎలాంటి చర్యలు తీసుకోబోం’ అని హామీ ఇచ్చారు. ధర్మాసనం దీనిని నమోదు చేసుకుని.. విచారణను జులై 24కి వాయిదా వేసింది. కాంగ్రెస్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి.. సుప్రీంకోర్టు తీర్పు ఎంతో ఉదారంగా ఉందని కొనియాడారు. వేర్వేరు ఏడాదులకు సంబంధించి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.3,500 కోట్ల బకాయి చెల్లించాల్సిందిగా నోటీసులు వచ్చాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని