రాజ్యసభతో మన్మోహన్‌ 33 ఏళ్ల అనుబంధానికి నేటితో తెర

రాజ్యసభ నుంచి మంగళ, బుధవారాల్లో మొత్తం 54 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ (91)తోపాటు 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు.

Published : 03 Apr 2024 09:49 IST

54 మంది రాజ్యసభ  సభ్యులకు వీడ్కోలు

దిల్లీ: రాజ్యసభ నుంచి మంగళ, బుధవారాల్లో మొత్తం 54 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ (91)తోపాటు 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వీరిలో కొందరు మళ్లీ ఎగువ సభకు వచ్చే అవకాశం లేదు. రాజ్యసభ సభ్యుడిగా డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం బుధవారంతో ముగియనుంది. ఆర్థికవ్యవస్థలో పలు సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్‌సింగ్‌ 1991 అక్టోబరులో మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసి, 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు దేశ ప్రధానిగా సేవలందించారు. మన్మోహన్‌ ఖాళీ చేయనున్న స్థానంలో ఇటీవల రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తొలిసారిగా పార్లమెంటు ఎగువసభలో అడుగుపెట్టనున్నారు.

కేంద్ర మంత్రుల్లో ధర్మేంద్ర ప్రధాన్‌ (విద్యాశాఖ), మన్‌సుఖ్‌ మాండవీయ (ఆరోగ్యం), పురుషోత్తం రూపాల (పశుసంవర్ధకం), రాజీవ్‌ చంద్రశేఖర్‌ (ఐటీ), వి.మురళీధరన్‌ (విదేశీ వ్యవహారాల సహాయమంత్రి), నారాయణ రాణె (మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌), ఎల్‌.మురుగన్‌ (సమాచార ప్రసారశాఖ సహాయమంత్రి)ల రాజ్యసభ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్‌ (పర్యావరణం), అశ్వినీ వైష్ణవ్‌ (రైల్వే)ల పదవీకాలం బుధవారం ముగియనుంది. ఈ 9 మందిలో అశ్వినీ వైష్ణవ్‌ మినహా మిగతా 8 మంది తాజా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైష్ణవ్‌, మురుగన్‌లకు రాజ్యసభ సభ్యులుగా మరో అవకాశం ఇచ్చారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు జయాబచ్చన్‌కు సైతం ఆ పార్టీ మరో అవకాశం ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు..

పదవీ విరమణ పొందనున్న 54 మంది రాజ్యసభ సభ్యుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సీఎం రమేశ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈ జాబితాలో ఉండగా.. తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర రిటైర్డ్‌ కానున్నారు. ఇందులో భారాసకు చెందిన వద్దిరాజు రవిచంద్ర మళ్లీ ఎన్నికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని