మీ క్షమాపణలను అంగీకరించలేం

పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు యోగా గురు బాబా రామ్‌దేవ్‌, కంపెనీ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది.

Updated : 03 Apr 2024 05:50 IST

అసత్య ప్రమాణాలతో అన్ని హద్దులూ దాటారు
‘పతంజలి కేసు’లో రామ్‌దేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక

దిల్లీ: పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు యోగా గురు బాబా రామ్‌దేవ్‌, కంపెనీ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది. వారిద్దరి క్షమాపణల్లో నిజాయతీ కనిపించడంలేదని, వాటిని అంగీకరించబోమని స్పష్టం చేసింది. అసత్య ప్రమాణాలకు గాను తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని గట్టిగా హెచ్చరించింది. కొవిడ్‌కు అల్లోపతిలో నివారణ లేదని పతంజలి ప్రకటనలు వెలువరించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా కళ్లు మూసుకుందని ప్రశ్నించింది. రామ్‌దేవ్‌, ఆచార్య బాలకృష్ణ వారంలోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 10న మరోసారి వారిద్దరూ న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసులో కోర్టు ధిక్కరణ చర్యల షోకాజ్‌ నోటీసులకు సంబంధించి రామ్‌దేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు.

విచారణ సందర్భంగా రామ్‌దేవ్‌ బాబా బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. క్షమాపణలు చెప్పాలని, అయితే వాటిని అంగీకరించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) దాఖలు చేసిన కేసులో గతంలో సమర్పించిన ప్రమాణ పత్రాలకు రామ్‌దేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణ కట్టుబడి ఉండలేదని ఆక్షేపించింది. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారని, అన్ని హద్దులనూ దాటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు తెలియజేస్తూ గత నెల పతంజలి సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్‌పై స్పందిస్తూ.. ‘చిత్తశుద్ధి కొరవడిన క్షమాపణలను అంగీకరించలేకపోతున్నాం. అవి నమ్మశక్యంగా లేవ’ని వ్యాఖ్యానించింది. చివరిసారిగా మళ్లీ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి వారం గడువు ఇస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ నెల పదో తేదీకి విచారణను వాయిదా వేసింది.

తమ సంస్థ ఉత్పత్తుల తయారీ, వాటి ప్రచారం, వాణిజ్య ప్రకటనల విషయంలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ గత ఏడాది నవంబరు 21న పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ హామీ ఇచ్చింది. తమ ఔషధాల ప్రభావశీలతను వివరించడం కోసం ఇతర వైద్య విధానాలను కించపరచబోమనీ తెలిపింది. అయితే, ఆ వాగ్దానాలను పతంజలి పట్టించుకోకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఔషధాలు, సౌందర్యలేపనాలు(మేజిక్‌ రెమెడీస్‌) చట్టానికి కాలం చెల్లిందన్న ఆచార్య బాలకృష్ణ అభిప్రాయాన్ని ధర్మాసనం తిరస్కరించింది. పతంజలి ఉత్పత్తులన్నీ ఆ చట్టం పరిధిలోకే వస్తాయని స్పష్టంచేసింది. అన్నింటికన్నా చట్టమే ఉన్నతమైనదని వ్యక్తులు గ్రహించేలా చేయడమే కోర్టు ధిక్కరణ చర్యల లక్ష్యమని జస్టిస్‌ హిమా కోహ్లీ పేర్కొన్నారు. ఒకసారి కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించిన తర్వాత దానిలోని అంశాలకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు