‘ఇండియా’ పేరుపై స్పందించండి

విపక్షాల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వారం రోజుల్లో తమ స్పందనలను తెలియజేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి, ప్రతిపక్షాలకు దిల్లీ హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది.

Published : 03 Apr 2024 04:39 IST

కేంద్రం, ప్రతిపక్షాలకు దిల్లీ హైకోర్టు ఆదేశం

దిల్లీ: విపక్షాల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వారం రోజుల్లో తమ స్పందనలను తెలియజేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి, ప్రతిపక్షాలకు దిల్లీ హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్‌మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోడాల ధర్మాసనం మంగళవారం పేర్కొంది. ఎన్నికలున్న నేపథ్యంలో ఈ కేసులో ముందస్తు విచారణ చేపట్టాలన్న అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. ఈ నెల 10న వాదనలు వింటామని స్పష్టం చేసింది. కేంద్రానికి, ప్రతిపక్షాలకు ఇప్పటికే ఎనిమిది అవకాశాలనిచ్చామని, కానీ వారు తమ స్పందనలు తెలియజేయలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వైభవ్‌ సింగ్‌ హైకోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌పై ప్రాథమిక అభ్యంతరాలున్నాయని, సుప్రీంకోర్టు ఇప్పటికే దీనిపై విచారించిందని ప్రతిపక్షాల తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కోవాలనే వ్యూహంతో విపక్ష రాజకీయ పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశం పేరును ఉపయోగించుకుంటున్నాయని దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ కూటమి ‘ఇండియా’ పేరును ఉపయోగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని