మహువా, దర్శన్‌ హీరానందానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు

పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రా, వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

Published : 03 Apr 2024 04:40 IST

దిల్లీ: పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రా, వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. సీబీఐ ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యను చేపట్టింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)లోని సివిల్‌ సెక్షన్ల కింద ఈడీ ఈ అంశంపై దర్యాప్తు చేస్తోంది. మహువా, దర్శన్‌లను విచారణకు పలుమార్లు పిలిచింది. అయితే వారు హాజరుకాలేదు.

భారీ మెజారిటీతో మళ్లీ గెలుస్తా: మహువా

గత ఎన్నికల్లో 60,000 మెజారిటీతో గెలుపొందిన తాను ఈసారి అంతకన్నా భారీ ఆధిక్యంతో లోక్‌సభకు ఎన్నికై తనపై జరిగిన కుట్రకు సరైన బదులిస్తానని మహువా మొయిత్రా ధీమా వ్యక్తంచేశారు. లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి డబ్బు తీసుకున్నారనే ఆరోపణపై అనర్హతకు గురైన మహువా.. ఈసారి కూడా పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ నియోజకవర్గం నుంచే పోటీచేస్తున్నారు. తనపై అనర్హత వేటు పెద్ద కుట్ర అని ఆమె ఆరోపించారు. సీబీఐ, ఈడీలు భాజపా శిబిరానికి రాజకీయ ఏజెంట్లుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు సంస్థలు తనకు పదేపదే సమన్లు పంపి, దాడులు చేసి తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఎన్నికల సంఘం స్వాతంత్య్రాన్ని కోల్పోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉన్న సెలక్షన్‌ కమిటీయే ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తోందని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని