దిల్లీ సీఎంగా సునీతా కేజ్రీవాల్‌?

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను తిహాడ్‌ జైలుకు తరలించడంతో సీఎం పదవి మార్పుపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి.

Updated : 03 Apr 2024 09:11 IST

కీలక నేతలు జైల్లో ఉండటంతో పదవి వరించే అవకాశం

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను తిహాడ్‌ జైలుకు తరలించడంతో సీఎం పదవి మార్పుపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. ఈడీ కస్టడీలో వలే కేజ్రీవాల్‌ జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారని ఆప్‌ నేతలు చెబుతున్నారు. ఒకవేళ దిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తే ఆ బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. దిల్లీ ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు ఎవరు? అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే తెరపైకి కొంత మంది పేర్లు వస్తున్నా, అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీత పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

మరో రబ్రీదేవి?

దిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం మొట్టమొదట వినిపిస్తున్న పేరు సునీతా కేజ్రీవాల్‌. అయితే ఇప్పటి వరకు రాజకీయాలకు ఆమె దూరంగానే ఉన్నారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో ఆమె తన భర్త తరఫున మాట్లాడుతూ భాజపాపై విమర్శలు చేశారు. దీంతో తదుపరి దిల్లీ సీఎంగా బాధ్యతలు చేపడతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అవినీతి కేసులో జైలు శిక్ష పడిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవి సీఎం పగ్గాలు చేపట్టినట్లు సునీతా కేజ్రీవాల్‌ కూడా చేపడతారని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు.

అవకాశాలు ఉన్నాయా?

మరో వైపు సునీతా కేజ్రీవాల్‌కు సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా? అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఐఆర్‌ఎస్‌ అధికారిణిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. ఉన్నత చదువులు చదివారు, ప్రస్తుతం ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉంది. ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. కేజ్రీవాల్‌ తర్వాత ముఖ్య నేతలుగా ఉన్న మనీశ్‌ సిసోదియా, సత్యేందర్‌ జైన్‌ కూడా జైలులో ఉన్నారు. దీంతో తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.


జైలు నుంచే కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని నడపాలి
సునీతతో ఆప్‌ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేయరాదని, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు డిమాండు చేశారు. వారంతా మంగళవారం దిల్లీలో కేజ్రీవాల్‌ భార్య సునీతతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు కేజ్రీవాల్‌ వెంటే ఉన్నారని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన తన పదవికి రాజీనామా చేయరాదని కోరారు. ఈ సమావేశానికి 62 మంది ఎమ్మెల్యేలకు గాను అందరు మంత్రులు సహా 55 మంది హాజరయ్యారు. మరో నలుగురు దిల్లీలో అందుబాటులో లేరు. మిగిలిన ముగ్గురూ (కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా, సత్యేంద్ర జైన్‌) తిహాడ్‌ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారంతా తమ సందేశాన్ని కేజ్రీవాల్‌కు తెలియజేయాలని సునీతను కోరారని ఆప్‌ సీనియర్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని