స్వేచ్ఛగా శాంతియుతంగా.. ప్రలోభాలకు దూరంగా ఎన్నికలు

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమరంతో పాటు, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా, ప్రలోభాలకు అతీతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఆదేశించారు.

Published : 04 Apr 2024 05:53 IST

సీఎస్‌లు, డీజీపీలకు సీఈసీ ఆదేశం

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమరంతో పాటు, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా, ప్రలోభాలకు అతీతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఆదేశించారు. ఆయన బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర సాయుధ బలగాల అధిపతులతో ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించారు. భయాందోళనలు లేకుండా ప్రతి ఓటరూ తమ హక్కును ఉపయోగించుకునే శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. గత అనుభవాలను బట్టి మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. మాదక ద్రవ్యాలు, మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాల రవాణాను అంతర్జాతీయ సరిహద్దుల్లో అడ్డుకోవాలన్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో మద్యం, డబ్బు, గంజాయి రవాణాకు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను గుర్తించి గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. ముప్పు ఆధారంగా అభ్యర్థులకు తగినంత భద్రత కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా జారీచేసిన ఆదేశాలు..

1. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ చెక్‌పోస్ట్‌లపై కఠిన నిఘా ఉంచాలి.
2. నేరగాళ్లు, సంఘ విద్రోహశక్తులకు సంబంధించిన నిఘా సమాచారాన్ని సరిహద్దు జిల్లాలు పంచుకోవాలి.
3. బోగస్‌ ఓట్లను అడ్డుకోవడానికి ఓటింగుకు 48 గంటలముందు అంతర్రాష్ట్ర సరిహద్దులను సీల్‌ చేయాలి.
4. తరచూ అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాలు జరగాలి.
5. అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేయాలి.
6. వ్యూహాత్మక ప్రదేశాల్లో అదనపు నాకాబందీ కేంద్రాలు ఏర్పాటుచేయాలి.
7. పోలింగ్‌ రోజు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయాలి.
8. సరిహద్దు రాష్ట్రాల్లోని ఎక్సైజ్‌ కమిషనర్లు మద్యం పర్మిట్లను ఎప్పటికప్పుడు తనిఖీచేయాలి. మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.
9. లైసెన్స్‌డ్‌ ఆయుధాలున్నవారు నిర్దేశిత గడువులోగా వాటిని స్వాధీనం చేసేలా చూడాలి. నాన్‌ బెయిలబుల్‌ వారంట్లను అమల్లోపెట్టాలి.
10. పారిపోయిన నేరగాళ్లు, నేరచరితులు, ఎన్నికల నేరాల్లో పాలుపంచుకున్నవారిపై చర్యలు తీసుకోవాలి.

వ్యయంపై గట్టి నిఘా

  •  అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్‌ రవాణాను అరికట్టాలి.
  •  చెక్‌పోస్టుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి నిఘా పెంచాలి.
  •  పోలీసులు, ఎక్సైజ్‌, రవాణా, జీఎస్‌టీ, అటవీశాఖ సిబ్బంది కలిసి ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించాలి.
  •  హెలిప్యాడ్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లపై గట్టి నిఘా ఉంచాలి.
  •  మద్యం, డ్రగ్స్‌ సరఫరా చేసే కీలక వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవాలి. దేశీయ మద్యం ప్రవాహాన్ని అరికట్టడానికి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయాలి.
  •  మద్యం, డ్రగ్స్‌, నగదు, తాయిలాల రవాణాకి వీలున్న మార్గాలను మ్యాపింగ్‌చేసి నిఘా ఉంచాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని