ప్రజా జీవితం నుంచి నిష్క్రమించిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి

మృదు స్వభావి, ఉన్నత విద్యావంతుడు, ఆర్థికవేత్త, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ (91) ప్రజా జీవితం నుంచి వైదొలిగారు.

Published : 04 Apr 2024 05:06 IST

33 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌
ముగిసిన రాజ్యసభ సభ్యత్వం

దిల్లీ: మృదు స్వభావి, ఉన్నత విద్యావంతుడు, ఆర్థికవేత్త, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ (91) ప్రజా జీవితం నుంచి వైదొలిగారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించి అభివృద్ధిపథంలో పరుగులు పెట్టేలా చేసిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి ఆయన. పార్లమెంటు సభ్యుడిగా 33 ఏళ్ల పాటు కొనసాగిన మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యత్వం బుధవారంతో ముగిసింది. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తిని నింపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి నిశ్శబ్దంగానే వైదొలగినప్పటికీ దేశ ఆర్థిక రంగానికి వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి.

దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించిన మన్మోహన్‌ సింగ్‌....ఆ తర్వాత కాలంలో పదేళ్ల పాటు(2004-2014) ప్రధాన మంత్రి పదవిలో కొనసాగారు. 1991 అక్టోబరు 1న అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై...2019 జూన్‌ 14 వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఆగస్టు 20న రాజస్థాన్‌ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ నెల 3 వరకు కొనసాగారు. రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్‌ యూనివర్సిటీలో, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అధ్యాపకుడిగా విద్యార్థులకు ఆర్థిక పాఠాలు బోధించారు. 1971లో కేంద్ర వాణిజ్యశాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులై అనతి కాలంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారు అయ్యారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూజీసీ ఛైర్మన్‌గా బహుముఖమైన సేవలను అందించారు.

అవినీతి ప్రభుత్వానికి నేతృత్వం వహించారు: భాజపా

ఆర్థికవేత్తగా ప్రపంచవ్యాప్త మన్ననలు పొందిన మన్మోహన్‌ సింగ్‌...పలు విమర్శలనూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన ప్రధాన మంత్రిగా ఉన్న పదేళ్లలో దేశం అనేక కుంభకోణాలకు నిలయంగా మారిందని విపక్ష భాజపా విమర్శించింది. దేశ చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రభుత్వానికి నేతృత్వం వహించారంటూ దుయ్యబట్టింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని మోదీ దేశ ప్రజలను సంపన్నులను చేస్తే...మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అవినీతితో ప్రజలను నిరుపేదలుగా మార్చిందని భాజపా ఐటీ విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ దుయ్యబట్టారు. అయితే, ఈ విమర్శలను కాంగ్రెస్‌ పార్టీ తోసిపుచ్చింది. ప్రధాని మోదీ పదేళ్ల పాలనను ‘చీకటి దశాబ్దం’గా అభివర్ణించింది. మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక విధానాలతో దేశం రూపురేఖలే మారిపోయాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ప్రశంసించారు. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ ఆర్థికాభివృద్ధి పరుగులు తీసిందని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని