సంక్షిప్త వార్తలు

అయోధ్యలో రామ మందిరం నిర్మించడం సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఇష్టం లేదు. ప్రజల సెంటిమెంటును ప్రధాని మోదీ గౌరవించి ఆలయాన్ని నిర్మించారు.

Updated : 04 Apr 2024 05:13 IST

ఎస్పీ, కాంగ్రెస్‌లకు రామ మందిరం ఇష్టం లేదు

ముజఫర్‌నగర్‌ (యూపీ): అయోధ్యలో రామ మందిరం నిర్మించడం సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఇష్టం లేదు. ప్రజల సెంటిమెంటును ప్రధాని మోదీ గౌరవించి ఆలయాన్ని నిర్మించారు. ఇండియా కూటమిలోని నేతలంతా కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. వారి కుంభకోణాల విలువ రూ.12 లక్షల కోట్లు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా


సగం మంది జైల్లో.. సగం మంది బెయిలుపై..

జైపుర్‌: వారసత్వ రాజకీయాలకు ఇండియా కూటమి పెట్టింది పేరు. ఆ కూటమిలోని నేతలు అవినీతి కేసుల్లో ఇరుక్కుని సగం మంది జైల్లో సగం మంది బెయిలుపై ఉన్నారు. ‘ఇండియా’ అంటే అవినీతిపరులను రక్షించే కూటమి. ఇందులోని పార్టీల నేతలంతా కుటుంబాల నుంచే వస్తారు. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం, సంజయ్‌సింగ్‌ బెయిలుపై ఉన్నారా లేదా.. కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా జైల్లో ఉన్నారా లేదా?

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా


అమేఠీ నుంచి రాహుల్‌ పారిపోయారు

పట్నా: అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పారిపోయారు. వయనాడ్‌లో పోటీ చేస్తున్నారు. అక్కడా గట్టి పోటీని ఆయన ఎదుర్కొంటున్నారు. వయనాడ్‌లో ముస్లింలు, క్రిస్టియన్లు అధికంగా ఉన్నారనే ఆయన అక్కడకు వెళ్లారు. ధైర్యముంటే అమేఠీలో రాహుల్‌ పోటీ చేయాలి.

భాజపా సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌


వైభవ్‌ గహ్లోత్‌ కోసం పని చేస్తా

దిల్లీ: అశోక్‌ గహ్లోత్‌ కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌ కోసం 100%ప్రచారం చేస్తా. 2004లో వచ్చిన ఫలితాలే ఈసారి వచ్చి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. గత ఎన్నికల్లోనూ వైభవ్‌కు టికెట్‌ ఇప్పించా. ఆయన తరఫున ప్రచారం చేసినా దురదృష్టవశాత్తూ ఓడిపోయారు. ఈసారి జలోర్‌లో ఆయన పోటీ చేస్తున్నారు. మళ్లీ ప్రచారం చేస్తా.

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌


అవినీతిపరులను అక్కున చేర్చుకుంటున్న భాజపా

ప్రతిపక్షాలపై భాజపా ఓ వైపు అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. మరోవైపు అవినీతి మరకలు ఉన్న నేతలను చేర్చుకుంటూనే ఉంటుంది. 2014 నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 మంది ప్రతిపక్ష నేతలు కాషాయ పార్టీలో చేరారు. వారిలో 23 మందికి శిక్ష నుంచి మినహాయింపు లభించింది!

కపిల్‌ సిబల్‌


సహాయక సిబ్బందిపై దాడులు బాధాకరం

ఇజ్రాయెల్‌ దాడిలో వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆరుగురు సిబ్బందితోపాటు మరొకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్రంగా కలచివేసింది. ఇప్పటివరకూ ఈ సంక్షోభంలో ప్రాణాలు కోల్పోయిన సహాయక సిబ్బంది సంఖ్య 196కు చేరింది. అందులో 175 మంది ఐక్యరాజ్య సమితికి చెందినవారే కావడం బాధాకరం.

ఆంటోనియో గుటెరస్‌


వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాం

మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాం. మధుమేహంతో బాధపడే వృద్ధులు ఇన్సులిన్‌ కోసం నెలకు 400 డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. మేము దాన్ని 35 డాలర్లకు తగ్గించగలిగాం. 40 లక్షల మంది విద్యార్థులకు 14400 కోట్ల డాలర్ల విద్యా రుణాలను రద్దు చేశాం.

బైడెన్‌


సముద్రాలపై నిర్లక్ష్యం తగదు

భూమిపై ఉండే ఆక్సిజన్‌లో 50 శాతాన్ని సముద్రాలు ఉత్పత్తి చేస్తాయి. కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాల్లో 30 శాతాన్ని సముద్రాలే పీల్చుకుంటాయి. మానవాళికి ఇంతటి మేలు చేసే సముద్రాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. వాటిని కాపాడుకోకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

యునెస్కో


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు