చైనాతో సంబంధాలు మాకు కీలకం

భారత్‌, చైనా మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికీ కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 11 Apr 2024 04:24 IST

‘న్యూస్‌ వీక్‌’ మేగజీన్‌ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

దిల్లీ: భారత్‌, చైనా మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికీ కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సరిహద్దు అంశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన.. దౌత్య, సైనిక స్థాయిల్లో సానుకూల, నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. న్యూయార్క్‌కు చెందిన ‘న్యూస్‌ వీక్‌’ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అన్నారు. ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతోందని, దౌత్యపరంగా, శాస్త్రీయంగా, సైనికపరంగా ఎదుగుతున్న తీరు.. భారత్‌ను ఓ వర్ధమాన సూపర్‌ పవర్‌గా నిలబెడుతోందని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు, క్వాడ్‌, రామ మందిరం తదితర అంశాల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడారు. చైనాతో సంబంధాలు భారత్‌కు చాలా ముఖ్యమని చెప్పారు. ‘‘సరిహద్దుల్లో దీర్ఘకాలంగా నెలకొన్న పరిస్థితి వేగంగా పరిష్కారం కావాలి. అదే జరిగితే మా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుంది’’ అని పేర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌లతో ఏర్పడిన క్వాడ్‌ కూటమి.. ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకం కాదని అన్నారు. తమకు వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పడిందంటూ గతంలో చైనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ఇలా పేర్కొనడం గమనార్హం. రామ మందిర ప్రారంభం గురించి మాట్లాడుతూ, రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకు తిరిగి రావడం దేశ ఐక్యతకు సంబంధించిన ఒక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం... ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని చెప్పారు. ‘‘ఎంతటి ఆదరణ ఉన్న ప్రభుత్వమైనా రెండో విడత పదవీకాలం ముగిసేలోపు మద్దతు కోల్పోతుంది. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. భారత్‌ ఇందుకు మినహాయింపు. మా ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోంది’’ అని ధీమాగా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని