సంక్షిప్త వార్తలు (3)

దేశంలో ఈ ఏడాది వేసవిలో సాధారణం కంటే మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రధాని మోదీ గురువారం కీలక సమావేశాన్ని నిర్వహించారు.

Updated : 12 Apr 2024 05:51 IST

వడగాలులను ఎదుర్కోవడంపై ప్రధాని సమీక్షా సమావేశం

దిల్లీ: దేశంలో ఈ ఏడాది వేసవిలో సాధారణం కంటే మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రధాని మోదీ గురువారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. వడగాలులతో తలెత్తే ఇబ్బందులను సమర్థంగా అధిగమించడంలో ప్రభుత్వ యంత్రాంగ సన్నద్ధతను సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఆరోగ్య రంగంలో నిత్యావసర ఔషధాలు, ఫ్లూయిడ్‌లు, ఐస్‌ప్యాక్‌ల అందుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) విడుదల చేసే మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ప్రాంతీయ భాషల్లోకి అనువదించి విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్చిచ్చులను సత్వరం ఆర్పివేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.


జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఫ్రెసిపొర గ్రామం రాజ్‌పొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అనంతరం ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ మొదలైందని ఓ పోలీసు అధికారి తెలిపారు. మరణించిన ఉగ్రవాదిని శ్రీనగర్‌కు చెందిన దనీశ్‌ షేక్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. అతడు నిషేధిత ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ (ఇది లష్కరే తోయిబా శాఖ)కు చెందినవాడని వెల్లడించారు. గత మూడు నెలల్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌ ఇదేనని అధికారులు తెలిపారు.


ఝార్ఖండ్‌, అస్సాంలో ఎన్‌ఐఏ దాడులు
 నక్సల్‌ గ్రూపునకు చెందిన సభ్యుడి అరెస్ట్‌

దిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఝార్ఖండ్‌, అస్సాంలలో దాడులు నిర్వహించింది. ఝార్ఖండ్‌లోని ఖూంటీ జిల్లాలో పీపుల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా నక్సల్‌ గ్రూపునకు చెందిన బినోద్‌ ముండా అలియాస్‌ సుఖ్వాను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. అతనిపై రాష్ట్రంలో నాలుగు కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతడి నుంచి కీలక పత్రాలు, రెండు వాకీటాకీలు, అయిదు మొబైల్‌ ఫోన్లు, రూ.11వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని