ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను స.హ.చట్టం కింద వెల్లడించలేం : ఎస్‌బీఐ

ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే సమర్పించిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం కింద వెల్లడించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తిరస్కరించింది.

Published : 12 Apr 2024 05:21 IST

దిల్లీ: ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే సమర్పించిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం కింద వెల్లడించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తిరస్కరించింది. అది వ్యక్తిగత సమాచారం కావడం, ‘నమ్మకస్తుని హోదా’ పరిధిలోకి రావడమే అందుకు కారణమని తెలిపింది. ఈసీకి అందజేసిన తరహాలో ఎన్నికల బాండ్ల వివరాలను డిజిటల్‌ రూపంలో అందించాలంటూ కమొడోర్‌ (విశ్రాంత) లోకేశ్‌ బాత్రా గత నెల 13న ఎస్‌బీఐకి స.హ. దరఖాస్తు అందజేశారు. అయితే ఆ వివరాలు ఇచ్చేందుకు బ్యాంకు నిరాకరించింది. దరఖాస్తుదారుడు కోరిన సమాచారం.. స.హ.చట్టంలో మినహాయింపులు ఉన్న సెక్షన్‌ 8(1)(ఇ), సెక్షన్‌ 8(1)(జె) పరిధిలోకి వస్తుందని ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, ఆ సంస్థ కేంద్ర ప్రజా సమాచార అధికారి బుధవారం తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఇచ్చేందుకు ఎస్‌బీఐ నిరాకరించడం విచిత్రంగా ఉందని బాత్రా పేర్కొన్నారు. మరోవైపు- ఎన్నికల బాండ్ల వివరాలను బయటపెట్టకుండా ఉండేలా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేకు ఎస్‌బీఐ తరఫున ఎంత రుసుము చెల్లించారో తెలియజేయాలని కూడా బాత్రా కోరారు. ఆ వివరాలనూ బ్యాంకు వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని