రెక్క తొడిగిన వాయుసేన!

సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో చేతిని కోల్పోయిన ఓ సైనికుడిని కాపాడేందుకు భారత వాయుసేన ఓ సాహసోపేత విన్యాసాన్ని చేపట్టింది.

Published : 13 Apr 2024 04:44 IST

చేయి తెగిన సైనికుడి కోసం సాహసం
చిమ్మచీకట్లో లేహ్‌ నుంచి దిల్లీకి తరలింపు

దిల్లీ: సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో చేతిని కోల్పోయిన ఓ సైనికుడిని కాపాడేందుకు భారత వాయుసేన ఓ సాహసోపేత విన్యాసాన్ని చేపట్టింది. చిమ్మచీకట్లో సి-130జె విమానం ద్వారా లద్దాఖ్‌ నుంచి అతడిని తరలించింది. శరవేగంగా దిల్లీ చేర్చింది. ఫలితంగా ఆ సైనికుడికి చేయి తిరిగొచ్చింది.ఈ నెల 9న లద్దాఖ్‌లో ఈ ఘటన జరిగింది. ఒక యంత్రంలో పడి ఆ సైనికుడి చేయి తెగిపోయింది. తెగిన చేతి నుంచి చూపుడు వేలు, బొటనవేలు కూడా వేరయ్యాయి. సైన్యం ఆ జవాన్‌ను కాపాడాలని సంకల్పించింది. తొలుత అతడిని లేహ్‌లోని సైనిక ఆసుపత్రికి వేగంగా తరలించారు. అక్కడ వైద్యులు అతడికి ప్రాథమిక వైద్యం చేసి, పరిస్థితి విషమించకుండా చూశారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి.. తెగిపోయిన చేతిని తిరిగి అమర్చడానికి 6-8 గంటల సమయం మాత్రమే ఉంది. అందుకు అవసరమైన వైద్య సౌకర్యాలు ఆ ప్రాంతంలో లేవు. దీంతో క్షతగాత్రుడిని దిల్లీలోని ‘ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రి’కి తరలించాలని సైన్యం నిర్ణయించింది. ఈ మేరకు వాయుసేనను సంప్రదించింది. గంటలోగానే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఉన్న హిండాన్‌ వైమానిక స్థావరం నుంచి సి-130జె సూపర్‌ హెర్క్యులెస్‌ రవాణా విమానం లేహ్‌ దిశగా బయల్దేరింది. రాత్రివేళ చిమ్మచీకట్లో అక్కడి ఎయిర్‌ఫీల్డ్‌లో దిగింది. ల్యాండింగ్‌ కోసం పైలట్లు.. చీకట్లోనూ వీక్షణకు సాయపడే నైట్‌ విజన్‌ సాధనాలను ఉపయోగించారు. ఆ విమానం.. బాధితుడిని తీసుకొని దిల్లీలోని పాలం వైమానిక స్థావరంలో ల్యాండ్‌ అయింది. ప్రయాణ సమయంలో.. తెగిపోయిన అతడి అవయవాలను శీతల కంటెయినర్‌లో భద్రపరిచారు. బాధితుడి పరిస్థితి విషమించకుండా వైద్యబృందం సపర్యలు చేస్తూనే ఉంది. దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రిలో వైద్యులు 9 గంటల పాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి, ఆ సైనికుడికి తెగిపోయిన చెయ్యి, చూపుడు వేలు, బొటనవేలును తిరిగి అమర్చారు. బాధితుడు ఇప్పుడు కోలుకుంటున్నాడని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు