సంక్షిప్త వార్తలు (7)

మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. అన్నదాతల రుణాలను మాఫీ చేయకపోగా వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ వసూలు చేస్తూ భారం మోపుతోంది.

Updated : 13 Apr 2024 05:52 IST

కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం

మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. అన్నదాతల రుణాలను మాఫీ చేయకపోగా వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ వసూలు చేస్తూ భారం మోపుతోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన భాజపా.. పదేళ్ల పాలనలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కూడా కల్పించలేదు. దీంతో వ్యవసాయం భారమై భాజపా పాలనలో లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు తెస్తాం.

ప్రియాంకా గాంధీ


ఇదే నిజమైన కేరళ స్టోరీ

కేరళను లక్ష్యంగా చేసుకొని పదేపదే విద్వేషపూరిత ప్రచారాలు కొనసాగిస్తున్న తరుణంలో, వాటిని తిప్పికొట్టేలా మలయాళీలు ఒక్కటై నిజమైన కేరళ స్టోరీని చూపించారు. సౌదీ అరేబియాలో మరణ శిక్షను ఎదుర్కొంటున్న కేరళ వ్యక్తి అబ్దుల్‌ రహీంను జైలు నుంచి విడిపించడానికి మానవతా హృదయంతో రూ.34 కోట్ల విరాళాలు ఇచ్చారు. కేరళ ప్రజల విలువలను చాటిచెప్పిన ఈ ఘటన విభజన గోడలను బద్దలుకొట్టింది. మానవతా లక్ష్యం కోసం చేతులు కలిపిన వారందరికీ కృతజ్ఞతలు.

పినరయి విజయన్‌


చిన్న అడుగులతోనే పెద్ద మార్పు

మీ జీవితాన్ని క్రమంగా మార్చుకోవడానికి ఇవి పాటించండి: 1.రోజుకు 10 నిమిషాలైనా వ్యాయామం చేయండి 2.ఒక పేజీ అయినా చదవండి 3.కనీసం 30 సెకన్లు ధ్యానం చేయండి 4.ఫోన్‌ చూసే సమయాన్ని వీలైనంత తగ్గించండి 5. రోజూ 10 నిమిషాలు ముందుగా నిద్రలేవండి 6.భోజనంలో ఒక్క ఆరోగ్యకరమైన పదార్థాన్నైనా చేర్చండి. చిన్న అడుగులే పెద్ద మార్పునకు దారిస్తాయి.

హర్ష్‌ గోయెంకా


బెంగాల్‌ పీడీఎస్‌ కుంభకోణం.. రూ.150 కోట్ల ఆస్తుల జప్తు

దిల్లీ: ప్రజా పంపిణీ పథకం (పీడీఎస్‌)లో అవకతవకలు, నగదు అక్రమ చలామణి కేసులో పశ్చిమబెంగాల్‌ ఆహారశాఖ మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌, మరో ఇద్దరికి సంబంధించిన రూ.150 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని జప్తు చేసినట్లు ఈడీ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ ముగ్గురినీ ఈడీ ఇప్పటికే అరెస్టు చేయగా ప్రస్తుతం జుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. జప్తు చేసిన ఆస్తుల్లో ఇళ్లు, హోటళ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి.


మణిపుర్‌లో కాల్పుల కలకలం
ఒకరికి గాయాలు

ఇంఫాల్‌: మణిపుర్‌లోని థౌబల్‌ జిల్లా హెయ్‌రోక్‌ గ్రామంలో సాయుధ గ్రామ వాలంటీర్లు, గుర్తు తెలియని వ్యక్తుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున దుండగులు గ్రామంపై కాల్పులకు పాల్పడగా.. సాయుధ వాలంటీర్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నింగ్‌థౌజమ్‌ జేమ్స్‌ సింగ్‌ అనే వ్యక్తికి తూటా తగిలింది. వెంటనే అతణ్ని ఇంఫాల్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. థౌబల్‌ సరిహద్దులోని కాకచింగ్‌ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రంపపు మిల్లును తగలబెట్టారు.


నామినేషన్‌ పత్రాలను ఏకపక్షంగా తిరస్కరించరాదు
సుప్రీంకోర్టులో పిటిషన్‌

దిల్లీ: ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను చిన్నచిన్న కారణాలతో ఏకపక్షంగా తిరస్కరించే అధికారాన్ని రిటర్నింగ్‌ ఆఫీసర్ల నుంచి తొలగించాలని  కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ దిశగా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు. బిహార్‌లోని బాంకా లోక్‌సభ స్థానానికి జవహర్‌ కుమార్‌ ఝా అనే వ్యక్తి వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


ఇకపై విద్యార్థినులకు నెలసరి సెలవులు
పంజాబ్‌ విశ్వవిద్యాలయం ప్రకటన

పంజాబ్‌: చండీగఢ్‌లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయం (పీయూ) 2024-25 విద్యా సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయ విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పీయూ ఉప కులపతి రేణువిగ్‌ ఈ ప్రతిపాదనను ఆమోదించారు. విద్యార్థినులు ఒక సెమిస్టర్‌కు గరిష్ఠంగా నాలుగు సెలవులు తీసుకునేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అయితే సెమిస్టర్‌, ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ లేదా ప్రాక్టికల్‌ పరీక్షల సమయంలో సెలవులు మంజూరు చేయరు. రుతుక్రమ సెలవులు పొందేందుకు విద్యార్థినులు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఫారంను నింపి డిపార్టుమెంట్‌ ఛైర్‌పర్సన్‌ లేదా డైరెక్టర్‌ ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. కేరళలోని కొచ్చిన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ దేశంలోనే మొదటిసారిగా 2023 జనవరిలో మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులను ప్రకటించింది. అనంతరం హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్శిటీ ఆఫ్‌ లా, అస్సాంలోని గుహవాటి విశ్వవిద్యాలయం, తేజ్‌పుర్‌ విశ్వవిద్యాలయం తమ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.


కేజ్రీవాల్‌ ‘ఆలోచనలను’ నిర్బంధించలేరు: మాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టవచ్చేమో కానీ ఆయన ఆలోచనలు, తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు. ఆప్‌ చేసే ఆలోచనలు దిల్లీ, పంజాబ్‌లలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాన్‌.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


ప్రమాదకర మార్గంలో ప్రయాణించి.. బ్యాలెట్‌ సదుపాయం కల్పించి
మహారాష్ట్రలో వృద్ధుల ఓట్ల కోసం అధికారులు పాట్లు

గడ్చిరోలి: లోక్‌సభ ఎన్నికల్లో ఇద్దరు వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించేందుకు మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన ఎన్నికల అధికారులు సాహసమే చేశారు. మెలికలు తిరుగుతూ ఉండే ప్రమాదకరమైన అడవి మార్గం గుండా 107 కిలోమీటర్లు ప్రయాణించారు. గడ్చిరోలి-చిమూర్‌ నియోజకవర్గానికి చెందిన కిష్టయ్య మదరబోయిన(100), కిష్టయ్య కోమెర(86)లకు ఈ సదుపాయం కల్పించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని