10% ప్రిస్క్రిప్షన్లలో ఆమోదయోగ్యం కాని వైరుధ్యాలు

భారత్‌లోని ఉన్నతస్థాయి బోధనాసుపత్రుల్లో వైద్యులు చేసే ప్రిస్క్రిప్షన్లలో దాదాపు 10 శాతం మేర ‘ఆమోదయోగ్యం కాని వైరుధ్యాలు’ ఉంటున్నట్లు ప్రభుత్వం నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది.

Published : 13 Apr 2024 05:39 IST

ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: భారత్‌లోని ఉన్నతస్థాయి బోధనాసుపత్రుల్లో వైద్యులు చేసే ప్రిస్క్రిప్షన్లలో దాదాపు 10 శాతం మేర ‘ఆమోదయోగ్యం కాని వైరుధ్యాలు’ ఉంటున్నట్లు ప్రభుత్వం నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. తగని మందులను రాయడం, ఒకటికన్నా ఎక్కువగా వ్యాధి నిర్ధారణలు చేయడం వంటివి ఇందులో ఉన్నాయని తెలిపింది. వీటివల్ల రోగులపై ఆర్థిక భారం పెరగడంతోపాటు ఔషధ దుష్ప్రభావాలు పడటం, లేదా చికిత్స విఫలం కావడం వంటి ఇబ్బందులు తలెత్తవచ్చని వివరించింది. 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకూ ఈ అధ్యయనం జరిగింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఇందులో దిల్లీలోని ఎయిమ్స్‌, సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి సహా దేశవ్యాప్తంగా ఉన్న బోధనాసుపత్రుల్లో ఐసీఎంఆర్‌కు చెందిన రేషనల్‌ యూజ్‌ ఆఫ్‌ మెడిసిన్స్‌ సెంటర్స్‌ (ఆర్‌యూఎంసీ) పాల్గొన్నాయి. వైద్య నిపుణుడి ప్రిస్క్రిప్షన్ల వల్ల ఔషధ రియాక్షన్లు తలెత్తడం, స్పందన లేకపోవడం, ఖర్చు పెరగడం, నివారణయోగ్యమైన ప్రతికూల ఔషధ దుష్ప్రభావం, యాంటీబయాటిక్‌ నిరోధకత వంటి వాటిని ‘ఆమోదయోగ్యం కాని వైరుధ్యం’గా పరిగణించారు. మొత్తం మీద దాదాపు 10 శాతం మేర ఇలాంటివి ఉంటున్నట్లు తేల్చారు. అధ్యయనంలో పరిశీలించిన ప్రిస్క్రిప్షన్లన్నీ ఆయా అంశాల్లో పీజీలు చేసిన వైద్యనిపుణులు సూచించినవే. సగటున వీరికి 4-18 ఏళ్ల అనుభవం ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని