సహేతుక కారణం లేనిదే నేర విముక్త తీర్పును అప్పీలు న్యాయస్థానం రద్దు చేయరాదు

కేవలం భిన్నాభిప్రాయానికి అవకాశం ఉందనే కారణంతో ట్రయల్‌ కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తీర్పును అప్పీలు న్యాయస్థానం రద్దు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Published : 13 Apr 2024 05:41 IST

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: కేవలం భిన్నాభిప్రాయానికి అవకాశం ఉందనే కారణంతో ట్రయల్‌ కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తీర్పును అప్పీలు న్యాయస్థానం రద్దు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దిగువ కోర్టు తీర్పులోని లోపమేమిటో స్పష్టంగా నమోదు చేయాలని, నమోదిత సాక్ష్యాలు సరైనవో కావో పునఃపరిశీలించి నిర్ధారించుకోవాలని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం తెలిపింది. ఓ హత్య కేసులో నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించిన ట్రయల్‌ కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేయడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నమోదిత సాక్ష్యాల ఆధారంగానే దిగువ కోర్టు తుది నిర్ణయానికి వచ్చిందా అన్నది కూడా పరిశీలించాల్సి ఉంటుందని తీర్పు రాసిన జస్టిస్‌ అభయ్‌ ఓక్‌ పేర్కొన్నారు. అయితే, హైకోర్టు ఉత్తర్వులో ఈ ప్రశ్నకు సమాధానం లేదనే విషయాన్ని ధర్మాసనం గుర్తించింది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను నిందితుడిపై మోపడాన్ని కూడా తప్పుపట్టింది. 1996 సెప్టెంబరులో గుజరాత్‌లో తండ్రీకొడుకులు ఒక వ్యక్తిని హత్య చేశారని కేసు నమోదైంది. సరైన ఆధారాలు లేవంటూ ట్రయల్‌ కోర్టు 1997 జులైలో నిందితులను విడుదల చేయగా....హైకోర్టు ఆ తీర్పును 2018లో రద్దు చేసింది. నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా తీర్పు వెలువడింది. ట్రయల్‌ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని