‘40 ఏళ్లుగా..’ కంచుకోటలా సియాచిన్‌

హిమాలయాలలోని ఉత్తర లద్ధాఖ్‌ చేరువలో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమనదం సియాచిన్‌.

Published : 14 Apr 2024 06:27 IST

‘ఆపరేషన్‌ మేఘదూత్‌’కు 4 దశాబ్దాలు పూర్తి
ఎత్తైన యుద్ధక్షేత్రంలో మెరుగుపడిన సౌకర్యాలు

దిల్లీ: హిమాలయాలలోని ఉత్తర లద్ధాఖ్‌ చేరువలో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమనదం సియాచిన్‌. ప్రపంచంలో అత్యంత ఎత్తైన, అతి శీతల యుద్ధ క్షేత్రం. భారత్‌కు అత్యంత కీలకస్థానంగా ఉండే ఈ ప్రాంతం కబ్జాకు పాకిస్థాన్‌ చేసిన యత్నాన్ని భారత్‌ సైన్యం దీటుగా వమ్ము చేసింది. 1984 ఏప్రిల్‌ 13న ఆపరేషన్‌ మేఘదూత్‌ పేరిట సైనిక చర్య చేపట్టి పాక్‌ పన్నాగాన్ని తిప్పికొట్టింది. సియాచిన్‌ హిమనదాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుంది. ఆ నాటి నుంచి 40 ఏళ్లుగా ఆ యుద్ధక్షేత్రం కంచుకోటలా మారింది. ఆ ప్రాంతంపై పాక్‌ ఈనాటి వరకూ మళ్లీ కన్నెత్తి చూడలేదంటే భారత సైనిక పాటవం, భద్రత ఏర్పాట్లు ఎంత పకడ్బందీగా ఉన్నాయో ఊహించవచ్చు. ఆపరేషన్‌ మేఘదూత్‌ చేపట్టి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆనాటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం సియాచిన్‌లో మెరుగుపడిన సౌకర్యాలను ఒకసారి పరిశీలిస్తే దేశ గస్తీ సామర్థ్యం అవగతమవుతుంది. 

అతిశీతల సియాచిన్‌ వాతావరణంలో మోహరించిన సైనికులకు ఆహార, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆయుధాలు, ఇతర సరకుల రవాణా, బట్వాడా చాలా కష్టసాధ్యం. సియాచిన్‌ను మన దేశం కాపాడుకున్న ఈ 40 ఏళ్లలో పై సమస్యలను అధునాతన సాంకేతికతలతో సాయుధ దళాలు అధిగమించగలిగాయి. ముఖ్యంగా గడచిన అయిదేళ్లలో పరిస్థితిని విశేషంగా మెరుగుపరిచారు.

ఎక్కువ బరువులను తీసుకెళ్లే హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో శీతాకాలంలో సైతం సైనికులకు నిత్యావసర సరకులను అందిస్తున్నారు. పర్వత ప్రాంతంలోని మిట్టపల్లాల్లో సులువుగా సంచరించగల ఏటీవీ వాహనాలను సమకూర్చారు. రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) లోయలను దాటడానికి తోడ్పడే ప్రత్యేక ఏటీవీ వంతెనలను సమకూర్చింది. డైనీమా తాళ్లతో గుట్టల మధ్య తాళ్ల వంతెనలను కట్టి సరకులు తరలిస్తున్నారు. అతిశీతల వాతావరణాన్ని తట్టుకోగల ప్రత్యేక దుస్తులు, పర్వతారోహణ సామగ్రితో సైనికులు సులువుగా సంచరించే వీలు కల్పించారు. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే పాకెట్‌ వెదర్‌ ట్రాకర్లను ప్రతి సైనికుడికి అందించారు. ఉన్నట్టుండి మంచుపెళ్లలు విరిగిపడే ప్రమాదం గురించి అవి ముందే హెచ్చరిస్తాయి. డబ్బాల్లో నిల్వ చేసిన కూరగాయల బదులు తాజా కూరగాయలు, పండ్లను సియాచిన్‌కు పంపుతున్నారు. వీశాట్‌ సాంకేతికతతో సైనికులకు అధునాతన మొబైల్‌, డేటా సౌకర్యాలను కల్పించారు. సైనికులతోపాటు నుబ్రా లోయ ప్రజలకు, పర్యాటకులకు వైద్య సేవలు అందించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ టెలిమెడిసిన్‌ కేంద్రాలను ఏర్పరచింది. పర్వత శిఖరాలలో అతిశీతల వాతావరణంలో ఊపిరి తీసుకోవడం కష్టమైనవారికి అత్యవసర చికిత్స చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని