కేజ్రీవాల్‌ పిటిషన్‌పై రేపు సుప్రీం విచారణ

మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ దిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్‌ చేస్తూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 15న విచారించనుంది.

Published : 14 Apr 2024 05:04 IST

దిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ దిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్‌ చేస్తూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 15న విచారించనుంది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌  కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌ను ఈడీ నెల రోజుల క్రితం అరెస్టు చేసింది. తన అరెస్టును సవాల్‌ చేస్తూ ఆయన దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు నిరాశే ఎదురైంది. దీనిపై కేజ్రీవాల్‌ సుప్రీంను ఆశ్రయించారు.

సీఎంను కలిసేందుకు అనుమతించడం లేదు: సంజయ్‌ సింగ్‌

తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆయన కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా కలిసేందుకు జైలు అధికారులు అనుమతించడంలేదని ఆప్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ శనివారం ఆరోపించారు. కేజ్రీవాల్‌ మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘కేజ్రీవాల్‌ను కేవలం ములాఖత్‌ జంగ్లా ద్వారా మాత్రమే కలిసేందుకు అనుమతించారు. వ్యక్తిగతంగా కలిసేందుకు వీలులేదు. ఇది అమానుషం. భాజపా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వ ఆదేశాలతో ఇలా జరుగుతోంది. జైల్లో కేజ్రీవాల్‌ హక్కులను లాగేసుకున్నారు’ అంటూ సంజయ్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు.

సాధారణ వ్యక్తిలా కలుసుకోనున్న మాన్‌

కేజ్రీవాల్‌ను పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌ సోమవారం సాధారణ వ్యక్తిలా ములాఖత్‌ జంగ్లాలో కలిసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోపక్క దేశవ్యాప్తంగా ‘రాజ్యాంగాన్ని కాపాడండి. నిరంకుశత్వాన్ని పారదోలండి రోజు’ పేరిట ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని