ఫోన్‌ రిపేరుకు ఇచ్చి దొరికిపోయారు

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Updated : 15 Apr 2024 05:53 IST

అనూహ్యంగా ఎన్‌ఐఏకు చిక్కిన రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు నిందితులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, మార్చి 1న చోటుచేసుకున్న పేలుడు ఘటన అనంతరం పారిపోయిన నిందితులు.. నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో తప్పించుకు తిరిగారు. ఈ క్రమంలో 35 సిమ్‌లు, నకిలీ ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సులతో దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చివరకు ఓ సెల్‌ఫోన్‌ను మరమ్మతులకు ఇచ్చి పోలీసులకు దొరికిపోవడం గమనార్హం. కోల్‌కతాలో అరెస్టైన ముసావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌, అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌ తాహాలను ఎన్‌ఐఏ కీలక నిందితులుగా అనుమానిస్తోంది. దాడి తర్వాత ఈ ఇద్దరు నిందితులు అనేక రాష్ట్రాలు తిరుగుతూ పశ్చిమబెంగాల్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో అనేక హోటళ్లలో తలదాచుకున్నారు. సెల్‌ఫోన్లను తరచూ మార్చిన నిందితులు దాదాపు 35 సిమ్‌ కార్డులు వాడారు. కోల్‌కతాలోని ఎస్‌ప్లనేడ్‌ ప్రాంతంలో కొన్నిరోజులు బసచేశారు. ఈ క్రమంలో ఓ నిందితుడి సెల్‌ఫోన్‌లో సమస్య తలెత్తింది. దాంతో అక్కడి చాంద్‌నీ చౌక్‌ మార్కెట్లోని ఓ దుకాణంలో రిపేర్‌కు ఇచ్చారు. ఫోన్‌లో మాత్రం సిమ్‌కార్డులు లేవు. మైక్రోఫోన్‌లో ఏదైనా సమస్య ఉందా? అని తెలుసుకుందామనుకున్న దుకాణం యజమాని.. అతడి దగ్గరున్న ఓ సిమ్‌ కార్డును అందులో పెట్టి చూశాడు. అదే నిందితులను పట్టించేందుకు మార్గం చూపింది. ఆ సాయంత్రం నిందితుడు వచ్చి ఫోన్‌ అడిగినప్పటికీ.. ఇంకా రిపేర్‌ కాలేదని, మరుసటి రోజు రావాలని చెప్పడంతో వెనుదిరిగి పోయాడు. అప్పటికే నిందితుల ఫోన్‌ను ట్రాక్‌ చేస్తున్న పోలీసులు.. ఆ మొబైల్‌లో వేసిన సిమ్‌కార్డు సిగ్నల్స్‌తో అప్రమత్తమయ్యారు. ఫోన్‌ ఐఎంఈఐ నంబరు ఆధారంగా దాని ఆచూకీ కనుగొన్నారు. మొబైల్‌ షాప్‌నకు చేరుకున్న దర్యాప్తు అధికారులు.. యజమాని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. అందులో ఒకరు పెట్టుకున్న టోపీ కూడా వారి ఆచూకీని గుర్తించేందుకు దోహదపడినట్లు తెలిసింది. చివరకు కోల్‌కతా శివారులోని దిఘా ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉన్న ఇద్దరు నిందితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని