రోజుకు రూ.100 కోట్లు!

ఎన్నికల సమయంలో వివిధ రాష్ట్రాల్లో రూ.4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Published : 16 Apr 2024 02:52 IST

ఎన్నికల సమయంలో రూ.4,658 కోట్ల సొత్తు స్వాధీనం

ఈనాడు, దిల్లీ: ఎన్నికల సమయంలో వివిధ రాష్ట్రాల్లో రూ.4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో రూ.395.39 కోట్ల నగదు, రూ.489.31 కోట్ల విలువైన మద్యం, రూ.2,068.85 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.562.10 కోట్ల విలువైన లోహాలు, ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.1,142.49 కోట్ల విలువైన కానుకలు ఉన్నట్లు తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని ప్రకటించింది. మార్చి 1 నుంచి ఇప్పటివరకు రోజుకు సగటున రూ.100 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో రూ.778 కోట్లతో రాజస్థాన్‌ తొలి స్థానాన్ని ఆక్రమించినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 12, తెలంగాణ 13 స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. 2019 ఎన్నికల కాలం మొత్తం కలిపి రూ.3,475 కోట్ల సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 13 మధ్యకాలంలోనే గత ఎన్నికల కంటే 33.85% ఎక్కువ సొత్తు చేజిక్కించుకున్నట్లు పేర్కొంది.

తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, ఓ ముఖ్య నాయకుడి వాహనశ్రేణిని తనిఖీ చేయడంలో వివక్ష చూపినందుకు ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం లీడర్‌ను సస్పెండ్‌ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ నాయకులకు సహకరిస్తూ నియమావళిని ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రకటనకు ముందు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.7,502 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, నగలు, ఉచిత కానుకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వాటితో కలిపితే మొత్తం ఇప్పటివరకు రూ.12వేల కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లయిందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 123 లోక్‌సభ నియోజకవర్గాలను ధన ప్రభావం అధికంగా ఉన్న వాటిగా గుర్తించామని తెలిపింది. నగదు, మద్యం తదితరాల పంపిణీకి సంబంధించి సీ-విజిల్‌ యాప్‌ ద్వారా 3,262 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది.

లద్ధాఖ్‌లో అత్యల్పంగా రూ.11,580 మాత్రమే

జమ్మూ: ఎన్నికల నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌లో అధికారులు రూ.4 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. లద్ధాఖ్‌లో ఈ మొత్తం రూ. రూ.11,580గా ఉందని, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడే అతి తక్కువ సొత్తు పట్టుబడిందని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని