ఎన్నికల బాండ్ల రద్దుపై అందరూ బాధపడతారు: మోదీ

ఎన్నికల బాండ్ల విధానంపై నిజాయతీగా ఆలోచిస్తే.. వాటి రద్దు గురించి ప్రతిఒక్కరూ బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 16 Apr 2024 10:01 IST

దిల్లీ: ఎన్నికల బాండ్ల విధానంపై నిజాయతీగా ఆలోచిస్తే.. వాటి రద్దు గురించి ప్రతిఒక్కరూ బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన మార్గం ఏర్పడిందన్నారు. జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు నగదు ఖర్చు చేస్తాయన్న మోదీ.. నల్లధనాన్ని అరికట్టేందుకు తన మనసుకు వచ్చిన స్పచ్ఛమైన ఆలోచనే ఎన్నికల బాండ్లని అన్నారు. ఈ పథకం కారణంగా భాజపాకే ఎక్కువ ప్రయోజనం చేకూరిందని ప్రతిపక్షాలు ఆరోపించడంపై మండిపడ్డారు. బాండ్ల అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తారని ప్రతిపక్షాలు ఆరోపించడాన్ని ఖండించారు. ‘‘దేశ భవిష్యత్తుపై నా వద్ద స్పష్టమైన ప్రణాళికలున్నాయి. రాజ్యాంగం మార్పుపై వస్తున్న వదంతులను నమ్మి భయపడకండి. దేశ సంపూర్ణ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటా’’ అని వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం కలలను నెరవేర్చాలని, ఇప్పటివరకు తాము చేసింది ట్రైలరు మాత్రమే అన్నారు.ఈవీఎంలపై విపక్షాల ఆరోపణల గురించి స్పందిస్తూ..‘‘ఓడిపోయిన ప్రతిసారీ వారు (విపక్షాలు) ఓ కారణంతో వస్తారు. ఓటమికి నేరుగా బాధ్యత వహించకుండా మిగతా అంశాలపై నిందలు వేస్తారు’’ అని మోదీ దుయ్యబట్టారు.

‘టెస్లా’ పెట్టుబడి ఎవరిదైనా.. తయారీలో భారతీయులే

భారత మార్కెట్లోకి ఎలాన్‌ మస్క్‌ ‘టెస్లా’ కార్ల పరిశ్రమ ప్రవేశంపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడి ఎవరిదైనా సరే.. తయారీరంగంలో మాత్రం భారతీయులే ఉండాలన్నారు. ప్రపంచస్థాయి కంపెనీ భారత్‌లో పెట్టుబడులు పెట్టడం స్వాగతించే విషయమే అన్నారు. ఎలాన్‌ మస్క్‌ భారత్‌కు మద్దతుదారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని