అనవసర ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి

వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యూహాత్మకంగా న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లేలా ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ప్రమాదకరమైన ధోరణి అని 21 మంది విశ్రాంత న్యాయమూర్తులు పేర్కొన్నారు.

Published : 16 Apr 2024 03:52 IST

 భారత ప్రధాన న్యాయమూర్తికి 21 మంది విశ్రాంత జడ్జీల లేఖ

దిల్లీ: వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యూహాత్మకంగా న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లేలా ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ప్రమాదకరమైన ధోరణి అని 21 మంది విశ్రాంత న్యాయమూర్తులు పేర్కొన్నారు. వీరంతా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌కు లేఖ రాశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి, బహిరంగంగా అవమానించి, న్యాయవ్యవస్థను తక్కువ చేసి చూపాలని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని వీరంతా పేర్కొన్నారు. అనవసర ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాలని సీజేఐకి విజ్ఞప్తిచేశారు. అవినీతి కేసుల్లో చిక్కుకున్న కొంత మంది విపక్ష నేతల విషయంలో అధికార భాజపా, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ లేఖ వెలువడటం గమనార్హం. లేఖపై సంతకం చేసిన వారిలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ దీపక్‌ వర్మ, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా తదితరులు ఉన్నారు. తమకు అనుకూలమైన తీర్పులు వస్తే పొగడటం, వ్యతిరేకంగా వస్తే విమర్శలు చేయడంతో కొందరు కావాలనే వ్యూహాత్మకంగా న్యాయవ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా.. న్యాయవ్యవస్థ పవిత్రతను, స్వయంప్రతిపత్తిని కాపాడాలని వారు సుప్రీంకోర్టును కోరారు.

ఇది మోదీ సన్నిహిత జడ్జీల లేఖ: కాంగ్రెస్‌

విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లేఖపై కాంగ్రెస్‌ స్పందించింది. గత కొన్ని నెలలుగా కీలక తీర్పులు వెలువరిస్తున్న సర్వోన్నత న్యాయస్థానాన్ని బెదిరించడానికి, భయపెట్టడానికే ప్రధాని మోదీ ఇలాంటి నాటకాలకు తెరలేపుతున్నారని ఆరోపించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భాజపా నుంచే పెనుముప్పు ఉందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. ‘‘లేఖపై సంతకం చేసిన వారిలో నాలుగో పేరు చూడండి. దీన్ని బట్టి లేఖ ఉద్దేశం, నేపథ్యం అర్థం చేసుకోవచ్చు’’ అని పరోక్షంగా జస్టిస్‌ ఎం.ఆర్‌. షా పేరును ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ‘‘గతంలో 600 మంది మోదీ సన్నిహిత న్యాయవాదులు రాసిన లేఖ పక్కనే ఈ మోదీ సన్నిహిత జడ్జీల లేఖనూ చేర్చాలి. ఇది ఓ రకంగా న్యాయవ్యవస్థను బెదిరించడమే’’ అని రమేశ్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని