కేజ్రీవాల్‌ కస్టడీ 23 వరకూ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈ నెల 23 వరకు స్థానిక కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించింది.

Published : 16 Apr 2024 03:53 IST

దిల్లీ న్యాయస్థానం ఆదేశం

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈ నెల 23 వరకు స్థానిక కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించింది. ఇదివరకు విధించిన కస్టడీ సోమవారంతో ముగిసిపోవడంతో అధికారులు ఆయన్ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపర్చారు. ఈ కేసులో విచారణ కీలక దశలో ఉందని..కస్టడీని మరో 14రోజులు పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దీంతో కేసులో సహ నిందితులుగా మరికొందరి కస్టడీ అదే తేదీతో ముగుస్తుందని పేర్కొంటూ ఆదేశాలు జారీ  చేసింది.


తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ

దిల్లీ మద్యం విధానం కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషనుపై తక్షణ విచారణ చేపట్టేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 24లోగా వివరణ ఇవ్వాలని కోరుతూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29 తర్వాత చేపడతామని పేర్కొంది. తన అరెస్టును సమర్థిస్తూ ఈ నెల 9న దిల్లీ హైకోర్టుజారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని