సంక్షిప్త వార్తలు (8)

మథురలోని శ్రీకృష్ణజన్మభూమి ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో కోర్టు పర్యవేక్షిత సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన అనుమతి అమలుపై నిలుపుదల (స్టే) ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది.

Updated : 16 Apr 2024 05:44 IST

మథుర షాహీ ఈద్గా మసీదులో కోర్టు పర్యవేక్షిత సర్వేపై స్టే పొడిగింపు

దిల్లీ: మథురలోని శ్రీకృష్ణజన్మభూమి ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో కోర్టు పర్యవేక్షిత సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన అనుమతి అమలుపై నిలుపుదల (స్టే) ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. మసీదు తరలింపు సహా ఆ వివాదానికి సంబంధించి ఇతర కేసుల విచారణ ప్రక్రియను హైకోర్టులో కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.


కేంద్ర మంత్రిపై థరూర్‌ వ్యాఖ్యలు ‘ఉల్లంఘనే’: ఈసీ

తిరువనంతపురం: భాజపా నేత, కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగానే పరిగణిస్తున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి నిరాధారమైన, అవాంఛితమైన విమర్శలు చేయవద్దని థరూర్‌ను గట్టిగా హెచ్చరించింది. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై శశిథరూర్‌ అసత్య, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి చంద్రశేఖర్‌ ఫిర్యాదు చేశారు. అయితే, తాను చంద్రశేఖర్‌ పేరు కానీ, భాజపా పేరు కానీ ప్రస్తావించలేదన్న థరూర్‌ వాదనలను ఈసీ తోసిపుచ్చింది.


ఖైదీలకు సౌకర్యాల్లో వివక్ష లేదు

ఆప్‌ ఆరోపణలపై దిల్లీ జైళ్ల శాఖ డీజీ స్పందన

దిల్లీ: తిహాడ్‌ జైల్లో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, నేరస్థుడి కంటే దారుణంగా చూస్తున్నారన్న ఆప్‌ ఆరోపణలను దిల్లీ జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) సంజయ్‌ బనివాల్‌ ఖండించారు. పీటీఐ ఎడిటర్స్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఖైదీలకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి వివక్ష లేదన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. దిల్లీ పాలనకు సంబంధించి వచ్చే వారం నుంచి ఇద్దరు మంత్రులతో కేజ్రీవాల్‌ భేటీ అవుతారన్న వార్తలపైనా డీజీ స్పందించారు. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న వ్యక్తి కేవలం రెండు రకాల దస్త్రాలపైనే సంతకాలు చేయవచ్చని.. అవి న్యాయపరమైన, ఫిర్యాదులకు సంబంధించినవే ఉండాలన్నారు. రాజకీయ స్వభావం కలిగినవి ఉండకూడదని చెప్పారు. ఈ నేపథ్యంలో జైలు నుంచే కేజ్రీవాల్‌ తదుపరి ఆదేశాలు ఎలా ఇవ్వనున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది.


ఎన్నికల బాండ్ల పథకం రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌

ఆ తీర్పును పునఃసమీక్షించాలని అభ్యర్థన

దిల్లీ: రాజకీయ పార్టీలకు అజ్ఞాతంగా నిధులు అందించే ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. ఫిబ్రవరి 15నాటి ఈ తీర్పు ద్వారా పార్లమెంటుకున్న విశేషమైన శాసన నిర్మాణ, కార్యనిర్వాహక విధానాల పరిధిని మించి సర్వోన్నత న్యాయస్థానానికే అధికారం ఉందని స్పష్టం చేసినట్లయ్యిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్‌ చేసిన వ్యక్తులకు ఆ పథకం వల్ల వారికి చట్టపరంగా కలిగిన నష్టమేమిటో గుర్తించడంలో న్యాయస్థానం విఫలమైందని పిటిషనర్‌, న్యాయవాది మాథ్యూస్‌ జె.నెడుంపర పేర్కొన్నారు.  


మణిపుర్‌ నిరాశ్రయులకు ఓటు వేసే అవకాశం కల్పించాలని పిటిషన్‌

 ఆలస్యంగా వచ్చారని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

దిల్లీ: జాతుల వైరంతో అట్టుడికిన మణిపుర్‌ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకుంటున్న నిరాశ్రయులకు ఓటు వేసే సదుపాయం కల్పించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. మణిపుర్‌ నివాసి నౌలక్‌ ఖామ్సువంతంగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర విచారణ జరిపారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి, దానికి సంబంధించిన వివిధ ప్రక్రియలు ప్రారంభమైన తర్వాత చివరి నిమిషంలో పిటిషనర్‌ కోర్టుకు వచ్చారని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మణిపుర్‌లో ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలుగుతుందని అభిప్రాయపడింది. అందువల్ల ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వలేమని తెలిపింది. సుమారు 18వేల మంది మణిపుర్‌వాసులు నిరాశ్రయులయ్యారని, ప్రస్తుతం వారున్న రాష్ట్రాల్లో ఓటింగ్‌లో పాల్గొనేలా సదుపాయాలు కల్పించాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు.


జిల్లా కోర్టుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ల అమలుపై నోటీసులు

కేంద్రం, రాష్ట్రాలు, హైకోర్టులకు జారీచేసిన సర్వోన్నత న్యాయస్థానం

దిల్లీ: జిల్లా కోర్టుల న్యాయాధికారుల నియామకాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ల అమలుపై కేంద్రం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, హైకోర్టులకు సోమవారం సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం-2016 నిర్దేశించినట్లుగా ఈ రిజర్వేషన్లు అమలుకావడంలేదంటూ పిటిషన్‌ దాఖలు కాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభించింది. జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ చట్ట నిబంధనలు దేశమంతటా ఒకే రీతిగా అమలయ్యేలా చూసేందుకు నిపుణుల కమిటీని నియమించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. పిటిషనర్లు ప్రస్తావించిన అంశాలకు సమాధానమివ్వాలని ధర్మాసనం నోటీసుల్లో ఆదేశించింది.


తల్లిదండ్రుల పేరుతో గుర్తింపును నిర్ధారించుకునే హక్కు: దిల్లీ హైకోర్టు

దిల్లీ: సొంత పేరు మీద కానీ, ఫలానా వ్యక్తి కుమార్తెగా లేక కుమారుడిగా కానీ గుర్తింపును నిర్ధారించుకునే మౌలిక హక్కు ప్రతి పౌరుడికీ ఉందని దిల్లీ హైకోర్టు ఉద్ఘాటించింది. ఒక బాలిక తండ్రి మరణించడంతో సీబీఎస్‌ఈ ధ్రువీకరణపత్రంలో తండ్రి పేరు బదులు బాబాయి పేరు నమోదైంది. దీనిపై వివాదం నెలకొంది. తండ్రి పేరును సరైన అక్షరాలతో ముద్రిస్తూ బాలికకు కొత్తగా 10, 12వ తరగతి మార్కుల పత్రాలను అందించాలని సీబీఎస్‌ఈని హైకోర్టు ఆదేశించింది. ఆధార్‌ తదితర అధికార పత్రాల్లో నమోదైన తండ్రి పేరులో తేడాలు ఉన్నాయని ఈ సందర్భంగా న్యాయస్థానం గమనించింది. ప్రాంతీయ భాషలోని పేరును ఆంగ్లంలోకి మార్చేటప్పుడు తేడాలు రావచ్చని పేర్కొంది. శ్రీవాస్తవ్‌ అనే పేరును పొరపాటున శ్రీవాస్తవగా నమోదు చేయవచ్చని వ్యాఖ్యానించింది. ఇలాంటి అంశాల్లో అతి పట్టింపు సరికాదని, ఆధార్‌, నివాస ధ్రువీకరణపత్రం వంటివి పరిశీలించాక పిటిషనర్‌ తండ్రి పేరు గురించి సందిగ్ధతకు తావు లేదని స్పష్టంచేసింది. బాలికకు కొత్తగా మార్కుల పత్రాలను అందించాలని సీబీఎస్‌ఈని ఆదేశించింది.


ఐటీ నోటీసులపై ఏచూరి అభ్యంతరం

నిలుపుదల చేయాలని సీఈసీకి లేఖ

దిల్లీ: కేరళలోని త్రిశ్శూర్‌ జిల్లా సీపీఎం కమిటీకి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నోటీసు పంపడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఇలాంటి చర్య చేపట్టడం ‘సమానావకాశాల సూత్రానికి’ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌కు లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకూ ఐటీ శాఖ నోటీసును నిలుపుదలలో ఉంచాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు