అల్లోపతి వైద్యాన్ని కించపరిచారో జాగ్రత్త

ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు బాబా రాందేవ్‌, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణపై మరోసారి సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టు ఉత్తర్వులను గతంలో మీరెలా అవహేళన చేశారో మాకు తెలుసు.

Updated : 17 Apr 2024 05:58 IST

గతంలోనూ కోర్టు ఉత్తర్వులను అవహేళన చేశారు
బహిరంగ క్షమాపణ చెప్పినా.. మేం మిమ్మల్నైతే వదిలిపెట్టం
యోగాగురు బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరిక

దిల్లీ: ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు బాబా రాందేవ్‌, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణపై మరోసారి సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టు ఉత్తర్వులను గతంలో మీరెలా అవహేళన చేశారో మాకు తెలుసు. మీరు అంత అమాయకులేం కాదు. మేం మిమ్మల్ని క్షమించడం లేదు’’ అని జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం పేర్కొంది. మంగళవారం విచారణకు బాబా రాందేవ్‌, బాలకృష్ణ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ మరోసారి బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. ‘‘ఆ సమయంలో మేము చేసింది తప్పిదమే. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటాం. కోర్టు ఆదేశాలను అగౌరవపరచాలన్నది మా ఉద్దేశం కాదు’’ అని అత్యున్నత ధర్మాసనానికి తెలిపారు. వీరి వివరణపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘నయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని మీకు తెలియదా? మీది బాధ్యతారాహిత్యం. మీరు చేసేది మంచి పనే. అయినా అల్లోపతిని తగ్గించి చూపించకూడదు. క్షమాపణలను పరిశీలిస్తాం’’  అని ధర్మాసనం తెలిపింది. తమ క్లయింట్లు బహిరంగంగా క్షమాపణలు చెబుతారని, పశ్చాత్తాపం కూడా ప్రకటిస్తారని రాందేవ్‌, బాలకృష్ణ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనానికి విన్నవించారు. ‘‘మీరు ఏ రూపంలో క్షమాపణలు చెబుతారో మాకు అనవసరం. దాని మీద మేం వ్యాఖ్యానించడం లేదు. మేమైతే మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు’’ అని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. అల్లోపతి వైద్యవిధానాల గురించి, కొవిడ్‌ టీకాల గురించి పతంజలి సంస్థ విద్వేషకర ప్రచారం చేస్తోందని 2022లో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఈ పిటిషన్‌ దాఖలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని