మన ఓటింగ్‌ వ్యవస్థను తక్కువ చేయొద్దు

జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్‌ ఓటింగ్‌ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్‌ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది.

Published : 17 Apr 2024 05:08 IST

బ్యాలెట్‌ విధానంలో ఏం జరిగిందో మాకు తెలుసు
పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ను గుర్తుచేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్‌ ఓటింగ్‌ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్‌ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది.

ఓట్ల లెక్కింపు సమయంలో... ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్‌లను సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా...విదేశాలతో మన ఓటింగ్‌ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని సూచించింది.

అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ వాదనలు వినిపిస్తూ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. ‘‘జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్‌ బ్యాలెట్‌ విధానానికే వచ్చాయి. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేం చెప్పడం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నాం. అందుకే మళ్లీ మనం కూడా పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతిని వినియోగించాలి. లేదా ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌ స్లిప్‌లను ఓటర్లే బ్యాలెట్‌ బ్యాక్సుల్లో వేసేలా ఏర్పాట్లు ఉండాలి’’ అని వాదించారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ జర్మనీ జనాభా ఎంత? అని ప్రశ్నించగా 6 కోట్ల మంది అని న్యాయవాది జవాబిచ్చారు. ‘‘మన దేశంలో 97కోట్ల మంది ఓటర్లున్నారు. అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని మీరు కోరుతున్నారు. బ్యాలెట్‌ పత్రాలు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు తెలుసు. మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు’’ అని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా తెలిపారు. ‘‘జర్మనీతో పోలిస్తే నా సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్‌ జనాభా ఎక్కువ. భారత ఎన్నికల ప్రక్రియను విదేశాలతో పోల్చడం సరికాదు. మనం ఎవరో ఒకరిపై విశ్వాసం ఉంచాలి. ఇలా వ్యవస్థను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నించకూడదు’’ అని జస్టిస్‌ దత్తా అసహనం వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా ఓటింగ్‌ విధానం, ఈవీఎంలను భద్రపర్చడం, కౌంటింగ్‌ ప్రక్రియ గురించి ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆరా తీసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసిన వారికి కఠిన శిక్ష లేకపోవడంపై ధర్మాసనం పెదవి విరిచింది. ‘‘ఇది తీవ్రమైన అంశం. శిక్ష పడుతుందనే భయం ఉండాలి’’ అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని