కోర్టు వెలుపలి నేర అంగీకారాలు బలహీన సాక్ష్యాధారాలే

న్యాయస్థానం వెలుపల నిందితులు చేసే నేర అంగీకారాలు స్వభావ రీత్యా బలహీనమైన సాక్ష్యాలే అవుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. బలమైన సాక్ష్యాలను సమర్థించేవిగా మాత్రమే అవి ఉంటాయని పేర్కొంది.

Published : 17 Apr 2024 05:03 IST

హత్య కేసు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించిన సుప్రీంకోర్టు

దిల్లీ: న్యాయస్థానం వెలుపల నిందితులు చేసే నేర అంగీకారాలు స్వభావ రీత్యా బలహీనమైన సాక్ష్యాలే అవుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. బలమైన సాక్ష్యాలను సమర్థించేవిగా మాత్రమే అవి ఉంటాయని పేర్కొంది. 1998లో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. పంజాబ్‌, హరియాణా హైకోర్టు 1999లో విధించిన జీవిత ఖైదును సవాల్‌ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతా మంగళవారం తీర్పు వెలువరించారు. సినిమా థియేటర్‌లో హత్య జరిగిందనేది ప్రాసిక్యూషన్‌ అభియోగం. దీనికి ఆధారం మృతుడి సోదరుడు, మరో వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం. నిందితుడు తానే హత్య చేసినట్లుగా తనతో చెప్పారని రెండో సాక్షిగా ఉన్న వ్యక్తి వెల్లడించారు. హత్య జరిగిన సమయంలో బాధితుడి సోదరుడు అక్కడే ఉన్నట్లు చెప్పిన ప్రాసిక్యూషన్‌ వాదన సహేతుకంగా లేదని ధర్మాసనం గుర్తించింది. బలమైన సాక్ష్యాలు లేకపోవడం, సమర్పించిన ఆధారాలు సందేహాస్పదం కావడంతో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని