పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే

పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు.

Published : 17 Apr 2024 05:06 IST

సుప్రీంకోర్టుకు తెలిపిన సొలిసిటర్‌ జనరల్‌

దిల్లీ: పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని 9 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం తరఫున మెహతా వాదనలు వినిపించారు. దేశం మొత్తంపై ప్రభావం చూపే ముఖ్యమైన పరిశ్రమలను కేంద్రం నియంత్రణలోనే ఉంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కరోనా సమయంలో శానిటైజర్ల ఉత్పత్తికి అవసరమైన ఇథనాల్‌ను నిర్ణీత ధరకే అందుబాటులో ఉంచేలా కేంద్రం తనకున్న నియంత్రణ అధికారాన్ని వినియోగించుకునే పరిశ్రమలను ఆదేశించిందని గుర్తు చేశారు. అవసరమైతే పరిశ్రమల్లో తయారయ్యే ఇథనాల్‌ అంతటినీ ఇందుకు కేటాయించేలా కేంద్రం చేయగలదన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమైన పరిశ్రమలు ఎల్లప్పుడూ కేంద్రం నియంత్రణలోనే ఉండాలన్నారు. పారిశ్రామిక మద్యం ప్రజలు నేరుగా సేవించేందుకు ఉపయోగపడదని తెలిపారు. మత్తుకలిగించే సాధారణ మద్యం తయారీ, రవాణా, కొనుగోలు, యాజమాన్యపరమైన అధికారాలు రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు 8వ ప్రవేశికలోని రాష్ట్రాల జాబితాలో చేర్చారు. కేంద్ర జాబితాలోని 52వ ప్రవేశిక, ఉమ్మడి జాబితాలోని 33వ ప్రవేశికలో పరిశ్రమల గురించిన ప్రస్తావన ఉంది. ప్రజాప్రయోజనాల రీత్యా వీటిపై పార్లమెంటు చట్టాలు చేయవచ్చని రాజ్యాంగం స్పష్టం చేసింది. ఉమ్మడిజాబితాలోని అంశాల్లో చట్టాలు చేసే అధికారం కేంద్రం, రాష్ట్రాలకు కూడా ఉంటుంది. అయితే, రాష్ట్ర చట్టమా, కేంద్ర చట్టామా అనే ప్రశ్న ఉత్పన్నమయినప్పుడు కేంద్ర శాసనమే చెల్లుబాటు అవుతుందని సొలిసిటర్‌ జనరల్‌ వివరించారు. వాహన కాలుష్యాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెట్రోల్లో ఇథనాల్‌ను కొంత శాతం మేర కలుపుతున్న విషయాన్నీ మెహతా గుర్తు చేశారు. ప్రస్తుత ధర్మాసనంలో సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో పాటు జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ సభ్యులుగా ఉన్నారు.

ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 1997లో రాష్ట్రాలకు వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో దానిని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు 2010లో తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ముందుకు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని