పీవీ, మన్మోహన్‌లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు

మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది.

Published : 18 Apr 2024 05:12 IST

సుప్రీంకోర్టులో సొలిసిటర్‌ జనరల్‌ వ్యాఖ్యలు

దిల్లీ: మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో పీవీతోపాటు అప్పట్లో ఆర్థిక మంత్రిగా పని చేసిన మన్మోహన్‌లు కీలక భూమిక పోషించారని కొనియాడింది. ‘లైసెన్స్‌ రాజ్‌’కు ముగింపు పలకడంతో పాటు ఆర్థిక సరళీకరణకు మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొంది. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అభిప్రాయం వ్యక్తంచేసింది. పీవీ, మన్మోహన్‌లు 1991లో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎన్నో చట్టాలను సరళీకరించాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు. కంపెనీ చట్టం, వాణిజ్య పద్ధతుల చట్టం సహా ఎంఆర్‌టీపీ వంటి ఆర్ధిక సంస్కరణలను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఇవి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణకు దారితీశాయని, ‘లైసెన్స్‌ రాజ్‌’ యుగానికి ముగింపు పలికేలా చేసిందన్నారు. ఆ తర్వాత మూడు దశాబ్దాల్లో వచ్చిన ప్రభుత్వాలు ఇండస్ట్రీ (డెవలెప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) చట్టం (ఐడీఆర్‌ఏ)- 1951ను సవరించడం అవసరమని భావించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది జడ్జీల విస్తృత ధర్మాసనానికి వివరించారు. ఐడీఆర్‌ఏ.. ‘లైసెన్స్‌ రాజ్‌’ (పరిశ్రమల లైసెన్సింగ్‌ విధానానికి సంబంధించి) రోజులను గుర్తుకు తెస్తోందంటూ సుప్రీం ధర్మాసనం విమర్శించిన క్రమంలో సొలిసిటర్‌ జనరల్‌ ఈ విధంగా స్పందించారు. ఈ ఆర్థిక సంస్కరణల వల్ల మార్పులు వచ్చినప్పటికీ.. ఐడీఆర్‌ఏ మాత్రం అలాగే ఉండిపోయిందని ప్రభుత్వం పేర్కొంది. కొవిడ్‌ మహమ్మారి వంటి పరిస్థితుల్లో దేశ ప్రయోజనాల దృష్ట్యా పరిశ్రమలను నియంత్రించే అధికారం కేంద్రం కలిగి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని