ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’

రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్‌షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు.

Published : 18 Apr 2024 05:38 IST

తమిళనాడులో ఎన్టీకే పార్టీ ఆదర్శం

ఈనాడు, చెన్నై: రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్‌షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. ప్లాస్టిక్‌ సీసాలు, ప్రచార కరపత్రాలు, బ్యానర్లు వగైరా ఆ దారుల్లో కనిపిస్తుంటాయి. తమిళనాడులోని నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్టీకే) పార్టీ సభల నిర్వహణ ఇందుకు భిన్నంగా ఉంటుంది. సభ పూర్తవగానే ఆ ప్రాంతంలోని వ్యర్థాలు సేకరించి తరలించేలా ప్రత్యేక వాలంటీర్లను ఏర్పాటు చేసుకొన్న ఈ పార్టీ అధికారుల మెప్పు పొందుతోంది. పార్టీలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పర్యావరణ విభాగంలో  రాష్ట్రవ్యాప్తంగా 1,000 మంది సభ్యులున్నారు. వీరంతా పర్యావరణహిత విషయాలపై అవగాహన ఉన్నవారే. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాల్లోనూ ఎన్టీకే అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఏకంగా 20 మంది మహిళా అభ్యర్థులు. ఎక్కడ సభ జరిగినా పార్టీ వాలంటీర్లు అక్కడికి చేరుకొని, సంచుల్లో వ్యర్థాలు సేకరించి తరలిస్తారు. పార్టీ వాలంటీర్లు, సభ్యులు ఇళ్ల నుంచే తాగునీటి సీసాలు తెచ్చుకుంటారు. సభలకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా నీటికుండలు అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్టీకే నిర్వహించిన 50 - 60 సభల్లో ఇవే పద్ధతులను పాటించారు. తమిళనాడులో పర్యావరణ ఉద్యమాలు నడిపిన వ్యవసాయ శాస్త్రవేత్త జి.నమ్మళ్వార్‌ను ఈ పార్టీ స్ఫూర్తిగా తీసుకొంది. ప్రజల ఆదరణ మాట ఎలా ఉన్నా తమ పోరాటం ఆగదంటారు ఎన్టీకే అధినేత, సినీనటుడు, దర్శకుడు సెంతమిళన్‌ సీమాన్‌. 2010లో పార్టీ స్థాపించిన ఈయన 2019 ఎన్నికల్లోనూ ఇదే పంథా అవలంబించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని