పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది.

Published : 18 Apr 2024 05:46 IST

 సోదాల్లో ఏకంగా 86 రెట్ల వృద్ధి
మన్మోహన్‌ సమయంలో 1,797 కేసులు
మోదీ పాలనలో 5,155 కేసులు
రూ.1,21,618 కోట్ల ఆస్తుల జప్తు
పీటీఐ విశ్లేషణలో వెల్లడి

దిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. అరెస్టులూ 24 రెట్లు అధికంగా చేసింది. ఏప్రిల్‌ 2014- మార్చి 2024 మధ్య అధికారిక గణాంకాలను, అంతకుముందు తొమ్మిది సంవత్సరాల (జులై 2005- మార్చి 2014)తో పోల్చి.. పీటీఐ ఈ విశ్లేషణ చేసింది. ఈ డేటాపై ఈడీ అధికారి ఒకరు స్పందిస్తూ. మనీ లాండరింగ్‌ నేరాలను కట్టడి చేయడానికి తాము తీసుకున్న చర్యలను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం.. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీని భాజపా ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయి. ఈడీ  చట్ట ప్రకారం నడుచుకుంటోందని భాజపా చెబుతోంది.

ఛార్జిషీట్లలో 12 రెట్ల వృద్ధి

  • మన్మోహన్‌ నేతృత్వంలోని యూపీఏ తొమ్మిదేళ్ల హయాంలో 1,797 కేసులను ఈడీ నమోదు చేస్తే, గత పదేళ్లలో ఆ సంఖ్య 5,155కు చేరింది. దాదాపు మూడు రెట్ల వృద్ధి.
  • సోదాల విషయంలో ఏకంగా 86 రెట్ల వృద్ధి నమోదైంది. 2014-24 మధ్య దేశవ్యాప్తంగా 7,264 సోదాలను ఈడీ నిర్వహించింది. అంతకుముందు తొమ్మిదేళ్లలో 84 సోదాలు జరిగాయి.
  • 2005లో పీఎంఎల్‌ఏ చట్టం అమల్లోకి వచ్చినా శిక్ష పడటం 2014 నుంచే ప్రారంభమైంది. ఇప్పటివరకు 63మంది దోషులుగా తేలారు.
  • పదేళ్ల మోదీ పాలనలో 755 మందిని ఈడీ అరెస్టు చేసింది. రూ.1,21,618 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. యూపీఏ హయాంలో 29 అరెస్టులు జరిగాయి. జప్తు చేసిన మొత్తం 5,086.43 కోట్లు. అంటే అరెస్టులు 26 రెట్లు, జప్తులు 24 రెట్లు పెరిగాయి.
  • స్థిర, చరాస్తుల జప్తునకు గత పదేళ్లలో 1971 ఉత్తర్వులను ఈడీ జారీ చేస్తే యూపీఏ హయాంలో ఆ సంఖ్య 311గా ఉంది.
  •  గత పదేళ్లలో ఛార్జిషీట్ల సంఖ్య 12 రెట్లు పెరిగింది. యూపీఏ హయాంలో 102 అభియోగపత్రాలే దాఖలయ్యాయి. భాజపా పాలనలో 1281 ఛార్జిషీట్లు నమోదయ్యాయి.  
  • గత పదేళ్లలో పీఎంఎల్‌ఏ నేరాల కింద రూ.15,710.96 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు న్యాయస్థానం నుంచి ఈడీ అనుమతి పొందింది. మొత్తం జప్తు చేసిన ఆస్తుల్లో తిరిగి రూ.16,404.19 కోట్ల ఆస్తులను వెనక్కి ఇచ్చేసింది.  
  • పీఎంఎల్‌ చట్టం కింద నగదును జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది. గత పదేళ్లలో రూ.2,310 కోట్ల విలువైన భారత, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. యూపీఏ హయాంలో రూ.43 లక్షలు నగదు జప్తు అయింది.
  • 2014-24 మధ్య కాలంలో భారత్‌ వదిలి వెళ్లిన నిందితులను పట్టుకొనేందుకు ఈడీ 24 ఇంటర్‌ పోల్‌ రెడ్‌ నోటీసులు విడుదల చేసింది. 43 మంది నిందితులను అప్పగించాలని కోరుతూ వివిధ దేశాలకు లేఖలు రాసింది. అలాంటి చర్యలేమీ యూపీఏ హయాంలో తీసుకోలేదు.
  • గత పదేళ్లలో మనీలాండరింగ్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను భారత్‌కు రప్పించడంలో ఈడీ సఫలమైంది. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, సంజయ్‌ భండారిలకు వ్యతిరేకంగా కూడా ఇలాంటి ఉత్తర్వులను సాధించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని