సంక్షిప్త వార్తలు (5)

మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్‌ కస్టడీని పొడిగించింది.

Updated : 19 Apr 2024 05:52 IST

సిసోదియా కస్టడీ 26 వరకు పొడిగింపు

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్‌ కస్టడీని పొడిగించింది. ఇప్పటికే విధించిన కస్టడీ గురువారంతో ముగియడంతో ఈడీ ఆయన్ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరుపర్చగా ఈ నెల 26 వరకు జుడిషియల్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో మనీశ్‌ సిసోదియాకు విధించిన సీబీఐ కస్టడీ సైతం 26నే ముగియనుండడం గమనార్హం. మరోవైపు 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ నిధుల నిర్వహణ చేపట్టారన్న ఆరోపణలతో ఇటీవల ఈడీ అదుపులోకి తీసుకున్న చన్‌ప్రీత్‌ సింగ్‌కు సైతం ఈ నెల 23 వరకు జుడిషియల్‌ కస్టడీని పొడిగించింది. ఈ ఎన్నికల్లో సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.వంద కోట్ల వరకు అక్రమంగా డబ్బులు చేతులు మారాయంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.


పారిశ్రామిక మద్యంపై రాష్ట్రాలదే అధికారం
సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వ వాదనలు

దిల్లీ: పారిశ్రామిక మద్యంపై రాష్ట్రాలకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు విన్నవించింది. వాటిని  కేంద్రం హరించజాలదని స్పష్టంచేసింది. ‘మత్తు కలిగించే మద్యం’కు విస్తృత అర్థాన్ని ఇవ్వాలని, అందులో పారిశ్రామిక మద్యాన్ని కూడా చేర్చాలని, అలాగే దాన్ని రాష్ట్రాల శాసనాధికార పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించింది. ఆల్కహాల్‌ కలిగిన అన్ని ద్రవాలనూ ‘మత్తు కలిగించే మద్యం’ పరిధిలోకి తీసుకురావాలని కోరింది. ‘మత్తు కలిగించే ద్రవం’ పరిధిలోకి పారిశ్రామిక మద్యం, ఆల్కహాల్‌ కలిగిన అన్ని ద్రవాలు వస్తాయని శాసనపరమైన చరిత్ర చెబుతోందని యూపీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది దినేశ్‌ త్రివేది తెలిపారు. పారిశ్రామిక మద్యం ఉత్పత్తిపై నియంత్రణ అధికారం కేంద్రానికే ఉంటుందని 1997లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు 9 మంది సభ్యుల ధర్మాసనం ముందుకొచ్చాయి.


నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు

వడపళని, న్యూస్‌టుడే: వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. ఈనెల 19నుంచి 30వరకు వీఐటీ వేలూరు, చెన్నై, ఏపీ(అమరావతి), భోపాల్‌లో పరీక్షలుంటాయని సంస్థ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 125 నగరాలతోపాటు దుబాయి, మస్కట్, ఖతార్‌, కువైట్, సింగపూర్‌, కౌలాలంపూర్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావచ్చని స్పష్టం చేసింది.

మే3న ఫలితాలు: మే 3న www.vit.ac.in వెబ్సైట్లో ఫలితాలు విడుదల చేసి.. అదేరోజు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తారు. లక్షలోపు ర్యాంకున్నవారు కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోని టాపర్లు, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారికి(ఒక విద్యార్థి, ఒక విద్యార్థినికి) వందశాతం ఫీˆజు మినహాయింపు ఉంటుంది. ‘సపోర్ట్‌ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్‌ రూరల్‌ స్టూడెంట్్స’ (ఎస్‌టీఏఆర్‌ఎస్‌) పథకం కింద హాస్టల్‌ మెస్‌లోనూ మినహాయింపు ఉంటుందని సంస్థ పేర్కొంది.


రూ.100 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం.. నలుగురు నైజీరియన్ల అరెస్ట్‌

నొయిడా: గ్రేటర్‌ నొయిడాలో ఓ ఇంటి నుంచి రూ.వంద కోట్ల విలువచేసే 26 కిలోల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో ఉంటున్న నలుగురు నైజీరియన్లను అరెస్టు చేసినట్లు గురువారం వెల్లడించారు. మరో రూ.50 కోట్ల విలువ చేసే ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని ఇళ్లలో విదేశీయులు డ్రగ్స్‌ తయారీ ల్యాబులు ఏర్పాటు చేసుకొంటున్నారని చెప్పారు.


ఆరు ఐఐటీలకు కొత్త డైరెక్టర్లు

దిల్లీ: దేశంలోని ఆరు ఐఐటీలకు గురువారం కొత్త డైరెక్టర్లు నియమితులయ్యారు. విద్యాశాఖలోని సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కాన్పుర్‌ ఐఐటీకి మహీంద్ర అగర్వాల్‌, గువాహటి ఐఐటీకి దేవేంద్ర జలిహాల్‌, జోధ్‌పుర్‌ ఐఐటీకి అవినాశ్‌ కుమార్‌ అగర్వాల్‌, ధన్‌బాధ్‌ ఐఐటీకి సుకుమార్‌ మిశ్ర, గోవా ఐఐటీకి డీఎస్‌ కట్టి, ఐఐటీ-బీహెచ్‌యూకు అమిత్‌ పాత్ర నేతృత్వం వహిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని