బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు

అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది.

Updated : 20 Apr 2024 05:52 IST

దిల్లీ: అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఈ నెల 22 లోగా నివేదిక అందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరుతూ బాలిక పంపిన ఈమెయిల్‌ సందేశంపై  స్పందించిన ధర్మాసనం సాయంత్రం 4.30 గంటలకు అత్యవసరంగా సమావేశమైంది. ఈ దశలో గర్భం తొలగిస్తే ఆ బాలికపై శారీరకంగా, మానసికంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలపాలని ముంబయిలోని ఓ ఆసుపత్రిని ధర్మాసనం ఆదేశించింది. దీనికోసం వెంటనే వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సూచించింది. తదుపరి విచారణ సోమవారం చేపట్టనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. బాలిక గర్భ విచ్ఛిత్తి అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించడంతో బాధితురాలి తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వైద్యపరంగా గర్భం తొలగింపునకు పిండం వయసు గరిష్ఠంగా 24 వారాలకు మించరాదని చట్టం చెబుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని