పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు

చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Published : 20 Apr 2024 06:09 IST

 ‘మద్రాసు’ కేసులో తీర్పు రిజర్వు

దిల్లీ: చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల అశ్లీల వీడియోలు డౌన్లోడ్‌ చేసుకొని చూడటాన్ని పోక్సో, ఐటీ చట్టాల కింద నేరంగా పరిగణించలేమని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీలును సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. బాలల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఫరీదాబాద్‌కు చెందిన ‘జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయెన్స్‌’, దిల్లీకి చెందిన ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’ ఎన్జీవోలు ఈ అప్పీలును దాఖలు చేశాయి.

ఈ వ్యవహారంలో జనవరి 11న తీర్పు చెప్పిన మద్రాసు హైకోర్టు.. తన మొబైల్‌ ఫోనులో చిన్నపిల్లల అశ్లీల వీడియోలను డౌన్‌లోడు చేసుకున్న 28 ఏళ్ల యువకుడికి వ్యతిరేకంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా రద్దు చేసింది. ఎన్జీవోల తరఫున సీనియర్‌ న్యాయవాది హెచ్‌.ఎస్‌.ఫుల్కా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. మద్రాసు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన నిందితుడి తరఫున హాజరైన న్యాయవాది.. ఆ వీడియోలు తన క్లయింటు వాట్సాప్‌కు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అయినట్లు సుప్రీంకోర్టుకు నివేదించారు. అప్పీలును విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాల ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని సూచనలు చేసింది. ‘‘ఎవరికైనా అటువంటి వీడియోలు ఇన్‌బాక్సులో వచ్చి చేరితే సంబంధిత చట్టాల కింద పరిశీలనను నివారించడానికి వాటిని డిలీట్‌ చేయాలి. అలా చేయకుండా ఐటీ నిబంధనలను ఉల్లంఘిస్తే అప్పుడు అది నేరమవుతుంది’’ అని స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ కేసుపై తన అభిప్రాయాలను ఏప్రిల్‌ 22లోగా లిఖితపూర్వకంగా తెలపాలని జాతీయ బాలల హక్కుల సంఘాన్ని (ఎన్‌సీపీసీఆర్‌) సీజేఐ కోరారు. వాదనలు ముగిశాయని, తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని