వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది.

Updated : 20 Apr 2024 09:13 IST

ఈటీవీ భారత్‌: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా ఈ వివాహం జరిగింది. గ్వాలియర్‌లోని న్యూ బ్రజ్‌ విహార్‌ కాలనీలో నివసించే శివాని పరిహార్‌కు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ. పెరిగేకొద్దీ ఆయననే ఆరాధిస్తూ వచ్చిన ఈ యువతి పెళ్లి కూడా కృష్ణుణ్నే చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి బుధవారం శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని (లడ్డూ గోపాల్‌జీ) పెళ్లి చేసుకుంది. ఆచార వ్యవహారాల ప్రకారం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా జరిపారు. వరుడు శ్రీకృష్ణుడి విగ్రహం బృందావన్‌ నుంచి బ్యాండు మేళాలతో ఊరేగింపుగా వచ్చింది. స్థానిక మందిరంలో వేదమంత్రాల సాక్షిగా వివాహం జరిగింది. ఈ ప్రక్రియ ముగిశాక శివానీకి వివాహ ప్రమాణ పత్రం కూడా వచ్చింది. అనంతరం శ్రీ కృష్ణుడి విగ్రహంతో శివానీ బృందావనానికి బయలుదేరింది. తన తదుపరి జీవితాన్ని బృందావనంలోని రాధా ధ్యాన్‌ ఆశ్రమంలో శ్రీ కృష్ణుని సేవలో ఆమె గడపనుంది. ఈ పెళ్లి విషయంలో తాము మొదట్లో సంశయించినా, శివానీ పట్టుదల చూసి అంగీకరించినట్లు ఆమె తల్లి మీరా పరిహార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని