మెదడు ఆరోగ్య పరిరక్షణపై జాతీయ కార్యదళం

మెదడు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగుపరచడం, వాటిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కార్యదళాన్ని ఏర్పాటు చేసింది.

Published : 21 Apr 2024 04:31 IST

దిల్లీ: మెదడు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగుపరచడం, వాటిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి శనివారం ఆఫీస్‌ మెమోరాండం విడుదలైంది. నాడీశాస్త్రంలో నిపుణులైన వారిని కార్యదళంలో సభ్యులుగా నియమించనుంది. సార్వజనీన ఆరోగ్య సంరక్షణ లక్ష్యాల్లో భాగంగా నాడీ వ్యవస్థల ఆరోగ్యాన్ని కాపాడటం, మానసిక రుగ్మతల నివారణ, బాధితుల పునరావాసానికి తీసుకోవాల్సిన చర్యలను, లోపాల సవరణలను కార్యదళం సిఫార్సు చేయనుంది. దీనిపై నివేదికను జులై 15నాటికి సమర్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశించింది. నాడీ సంబంధ సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. మూడు దశాబ్దాల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌, మూర్ఛ, పార్కిన్సన్‌, తీవ్ర మతిమరుపు వంటి రుగ్మతలు దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అధికమయ్యాయి. పలు అసమానతల కారణంగా సమస్యను కొలిక్కి తీసుకురావడం కష్టతరమవుతోంది. అందువల్ల దేశంలో మెదడు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన, ఆచరణాత్మక విధానాల రూపకల్పన అత్యవసరమని మెమోరాండంలో మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని