దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించలేమా!

సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ విజ్ఞప్తి చేశారు.

Published : 21 Apr 2024 06:34 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం చేపట్టిన ‘నా ఓటు...నా గళం’ కార్యక్రమంలో భాగంగా ఆయన వీడియో సందేశం పంపించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది. ఎన్నికల్లో ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యత. ఐదేళ్లకు ఒకసారి మన దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించడం సాధ్యమే కదా! ఓటు హక్కును వదులు కోవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నా. గర్వంగా ఓటు వేద్దాం’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆ సందేశంలో పేర్కొన్నారు. తాను మొదటి సారి ఓటు వేయడానికి చూపిన ఉత్సాహాన్ని, ఓటు వేసినప్పుడు కలిగిన ఆనందాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పోలింగ్‌ కేంద్రంలో వేలిపై వేసే సిరా.. దేశంపై మనకున్న బాధ్యతను గుర్తుచేస్తుందన్నారు.

నేటి కాలానికి దీటైనవి కొత్త నేర న్యాయ చట్టాలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా మన సమాజ అవసరాలు తీర్చేలా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలిపారు. ఇదో కీలకమైన మలుపని ప్రశంసించారు. ‘నేర న్యాయ పాలనా వ్యవస్థలో భారతదేశ ప్రగతిశీల పథం’ అనే అంశంపై శనివారం దిల్లీలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. కొత్త నేర న్యాయ చట్టాలను తగిన రీతిలో వినియోగించుకుంటే అవి విజయవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితుల ప్రయోజనాల రక్షణకు పెద్దపీట వేస్తూ దర్యాప్తు, విచారణలను సమర్థంగా కొనసాగించడానికి వీలుగా నేర చట్టాలను ఉన్నతీకరించారని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో పాటే పెరుగుతున్న సైబర్‌ నేరాలు, ముందుకొస్తున్న డిజిటల్‌ యుగ సరికొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి భారతదేశం సర్వసన్నద్ధమైందని కొత్త చట్టాలు విస్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. దర్యాప్తు, సాక్ష్యాల నిక్షిప్తీకరణ, విచారణలు, తీర్పులు వెలువరించడంలోని సమస్యలకు పరిష్కారాలున్నాయన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేసిన ఈ కొత్త నేర న్యాయ చట్టాలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని