భిన్న జగతిలో విశ్వబంధుగా భారత్‌

పంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Published : 22 Apr 2024 06:25 IST

మహావీర్‌ నిర్వాణ్‌ మహోత్సవ్‌లో ప్రధాని

దిల్లీ: ప్రపంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భిన్న దృక్పథాలు గల ప్రపంచంలో విశ్వబంధుగా భారత్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని తెలిపారు. ఆదివారం 2,550వ భగవాన్‌ మహావీర్‌ నిర్వాణ్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా సత్యం, అహింస సూత్రాలను అంతర్జాతీయ వేదికలపై భారత్‌ చెబుతోందన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన స్మారక స్టాంపు, నాణేలను విడుదల చేసిన మోదీ ఆశీస్సులు అందించిన జైన సాధువులకు కృతజ్ఞతలు తెలిపారు. యోగ, ఆయుర్వేదం వంటి భారతీయ వారసత్వాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. కళాకారులు ప్రదర్శించిన ‘వర్తమాన్‌ మే వర్ధమాన్‌’ నృత్యనాటికను ప్రధాని అభినందించారు. భగవాన్‌ మహావీర్‌ బోధనలను నేటి యువత అనుసరిస్తోందంటే అది ఈ దేశం సరైన దిశలో పయనిస్తోందని చెప్పడానికి సంకేతమని తెలిపారు. గత ఫిబ్రవరి నెలలో పరమపదించిన ఆచార్య శ్రీ విద్యాసాగర్‌ మహరాజ్‌కు నివాళులు అర్పించిన ప్రధాని ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

సాధువులకు ‘కమలం’తో అనుబంధమే కదా!

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని సభలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలతో దేశం మరో కొత్త ప్రయాణం ప్రారంభిస్తుందని, అందరూ ఉదయాన్నే వెళ్లి ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ‘పూజా పునస్కారాల్లో తరచూ వినియోగించే కమలం (భాజపా ఎన్నికల గుర్తు)తో సాధువులకు అనుబంధమే కదా’ అని మోదీ సరదాగా అన్నారు. కేంద్ర మంత్రులు అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, మీనాక్షీ లేఖి, పలువురు జైన ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని