దిల్లీ డంపింగ్‌ యార్డులో భారీ అగ్ని ప్రమాదం

దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్‌ డంపింగ్‌ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

Published : 23 Apr 2024 04:53 IST

కంటి దురద, శ్వాస ఇబ్బందులతో స్థానికుల అవస్థలు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్‌ డంపింగ్‌ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దాదాపు 24 గంటలకు పైగా కొనసాగుతున్న మంటలతో స్థానికంగా దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. పొగను పీల్చుకున్న వారిలో కంటి దురద, శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తినట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి ప్రమాదాన్ని నివారించేందుకు ప్రయత్నించింది. వేడి, పొడి వాతావరణం కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన దిల్లీలో రాజకీయ రగడకు దారి తీసింది. ఘటనా స్థలాన్ని సందర్శించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా.. ఇది ఆప్‌ అవినీతికి ఉదాహరణ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. డంపింగ్‌ యార్డులోని చెత్తను తొలగిస్తామని కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయిందని దుమ్మెత్తిపోశారు. మొత్తం 70 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ డంపింగ్‌ యార్డులో 2024 లోగా చెత్తను తొలగించేందుకు దిల్లీ ప్రభుత్వం ఓ ప్రైవేట్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అనంతరం చెత్త ఎక్కువగా ఉన్న కారణంగా గడువును 2026కు పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని