ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు

లోక్‌సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది.

Published : 23 Apr 2024 04:56 IST

ఈసీకి వివరించిన ఐఎండీ

దిల్లీ: లోక్‌సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. ఈ నెల 26న ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాతావరణం సాధారణంగానే ఉంటుందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత వర్గాలతో ఈసీ సమావేశం నిర్వహించింది. వడగాడ్పులకు భయపడి ప్రజలు బయటకు రాకపోతే పోలింగ్‌ శాతం పడిపోతుందనే భయం నెలకొనడంతో ఈ అంశంపై చర్చించింది. ఈసీ, ఐఎండీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంయే) అధికారులతో ఒక కార్యదళం (టాస్క్‌ఫోర్స్‌) ఏర్పాటు చేయాలని, ప్రతి దశ పోలింగుకు ఐదు రోజుల ముందు ఎండల తీవ్రత, గాలిలో తేమశాతంపై ఆరోగ్య మంత్రిత్వశాఖ సమీక్షించాలని నిర్ణయించారు. ఎన్నికల కార్యకలాపాలను ప్రభావితం చేసే స్థాయిలో ఎండలు ఉండేటట్లయితే రాష్ట్రాల ఆరోగ్య శాఖలకు తగిన సూచనలు జారీ చేయాలని ఈసీ ఆదేశించింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద పందిళ్లు వేయడంతోపాటు.. తాగునీరు, ఫ్యాన్లు వంటి కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసేందుకు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో ఈసీ మరో సమీక్షను నిర్వహించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని