30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి

అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది.

Published : 23 Apr 2024 06:00 IST

అత్యాచార బాధిత బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు

దిల్లీ: అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. బాధితురాలి పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా లభించిన విస్తృత అధికారాలను ఉపయోగించుకుని తీర్పు వెలువరించింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురై గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని ఈ నెల ఆరంభంలో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం గర్భ విచ్ఛిత్తికి నిరాకరించింది. బాధితురాలి గర్భంలోని పిండం ఎదుగుదల చివరి త్రైమాసికంలో ఉన్నందున అబార్షన్‌కు అనుమతించలేమంటూ పిటిషన్‌ను ఈ నెల 4న కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గత వారం ముంబయిలోని ఆసుపత్రి వైద్య మండలి నివేదికకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం ఆదేశించింది. ‘‘ఈ సమయంలో అబార్షన్‌ వల్ల కొంత ప్రమాదం ఉన్నప్పటికీ.. కాన్పు తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదు. బాలిక అభిష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని కొనసాగించడం వల్ల ఆమెపై శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుంది’’ అని ఆసుపత్రి వైద్య మండలి నివేదించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సోమవారం అనుమతినిచ్చింది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ముంబయి ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. వ్యయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.వైద్యపరంగా గర్భం తొలగింపునకు పిండం వయసు గరిష్ఠంగా 24 వారాలకు మించరాదని చట్టం చెబుతుంది. ఆ వయసు దాటితే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని