బెంగాల్‌ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు

పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్‌ఎల్‌ఎస్‌టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Published : 23 Apr 2024 05:04 IST

ఎస్‌ఎల్‌ఎస్‌టీ-2016 కేసులో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్‌ఎల్‌ఎస్‌టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి పరీక్ష ద్వారా జరిపిన పాతిక వేలకుపైగా నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 9-12 తరగతులకు ఉపాధ్యాయులతోపాటు బోధనేతర సిబ్బంది నియామకం కోసం బెంగాల్‌ సర్కారు ఎస్‌ఎల్‌ఎస్‌టీ-2016 నిర్వహించింది. నాటి నోటిఫికేషన్‌లో మొత్తం 24,640 ఖాళీలను పేర్కొంది. 23 లక్షల మందికిపైగా పరీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వం చివరకు 25,753 మందికి ఉద్యోగాలిచ్చింది. ఆ నియామక ప్రక్రియలో- అర్హుల జాబితాలో లేనివారికి, ఖాళీ ఓఎంఆర్‌ షీట్‌లు సమర్పించినవారికి నియామక పత్రాలు ఇవ్వడం వంటి తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ దాఖలైన 350 పిటిషన్లపై.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటుచేసిన డివిజన్‌ ధర్మాసనం విచారణ నిర్వహించింది. గత నెల 20న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది. నియామక ప్రక్రియలో అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి, మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని అందులో ఆదేశించింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత పక్షంరోజుల్లోగా కొత్త నియామక ప్రక్రియను ప్రారంభించాలని బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)కు ధర్మాసనం సూచించింది.

ఆర్టికల్‌-14, 16లకు విరుద్ధం

ఎస్‌ఎల్‌ఎస్‌టీ-2016 నియామకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌-14 (చట్టం ముందు అందరూ సమానులే), ఆర్టికల్‌-16 (ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో వివక్షను నిషేధించడం)లకు విరుద్ధంగా జరిగాయని జస్టిస్‌ దెబాంగ్సు బసాక్‌, జస్టిస్‌ శబ్బర్‌ రశీదీల ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టబద్ధంగా ఎంపికైనవారికి ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉన్నప్పటికీ.. మొత్తం నియామకాలను రద్దు చేయడం తప్ప తమ ముందు మరో ఐచ్ఛికం లేదని తీర్పులో పేర్కొంది. మోసపూరిత విధానంలో ఎంపికైనవారిని ఉద్యోగాల్లో కొనసాగిస్తే.. భవిష్యత్తు తరాల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందని గుర్తుచేసింది. ఎస్‌ఎల్‌ఎస్‌టీ-2016 వ్యవహారంలో ఇప్పటికే నమోదు చేసిన నాలుగు కేసుల్లో మరింత లోతుగా దర్యాప్తు జరపాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. నాడు 24,640కి మించి ఇతర ఖాళీలకు ఎంపికైనవారిని, నియామక గడువు ముగిశాక ఉద్యోగం పొందినవారిని, ఖాళీ ఓఎంఆర్‌ షీట్‌లు సమర్పించినా ఉద్యోగం వచ్చినవారిని అవసరమైతే కస్టడీలోకి తీసుకొని మరీ విచారణ జరపాలని సూచించింది. అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం అదనపు పోస్టులను సృష్టించడంలో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చాలని పేర్కొంది. అప్పుడే ఈ కుంభకోణం ఎంత పెద్దదో తెలుస్తుందని అభిప్రాయపడింది.

12% వార్షిక వడ్డీతో వేతనాలు వెనక్కి ఇవ్వాలి

24,640కి మించి సృష్టించిన ఖాళీలకు ఎంపికైనవారు, నియామక గడువు ముగిశాక ఉద్యోగం పొందినవారు, ఖాళీ ఓఎంఆర్‌ షీట్‌లు సమర్పించినా ఉద్యోగం వచ్చినవారు.. ఇప్పటిదాకా తాము పొందిన వేతనాలను, ఇతర ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 12% వార్షిక వడ్డీతో నాలుగు వారాల్లోగా తిరిగి చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. తాజా తీర్పుపై స్టే విధించాలంటూ బెంగాల్‌ ఎస్‌ఎస్‌సీ సహా మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది. ఎస్‌ఎల్‌ఎస్‌టీ-2016 కుంభకోణంలో బెంగాల్‌ విద్యాశాఖ మాజీ మంత్రి పార్థ ఛటర్జీతోపాటు మరికొందరు అధికారులను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది.


వారిని ఉరితీయాలి

గంగోపాధ్యాయ

హైకోర్టు తీర్పుతో మమత సర్కారు అవినీతి మరోసారి బహిర్గతమైందని భాజపా విమర్శించింది. ఆమె సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. గత నెలలో కలకత్తా హైకోర్టు జడ్జి పదవిని వీడి భాజపాలో చేరిన అభిజీత్‌ గంగోపాధ్యాయ స్పందిస్తూ.. ఎస్‌ఎల్‌ఎస్‌టీ-2016 కుంభకోణంలో అసలు దోషులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఆరోపించారు. వారందర్నీ ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. ఈయన నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనమే గతంలో ఎస్‌ఎల్‌ఎస్‌టీ-2016 కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి గమనార్హం.


సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం

-మమత

స్‌ఎల్‌ఎస్‌టీ-2016 ద్వారా నియమించిన బోధన, బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తమ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తుందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయినవారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్‌గంజ్‌లో మాట్లాడుతూ ఈ విషయంపై ఆమె స్పందించారు. 8 ఏళ్ల వేతనాన్ని కేవలం 4 వారాల గడువులో చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కొందరు భాజపా నేతలు న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని మమత ఆరోపించారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయిస్తామని బెంగాల్‌ ఎస్‌ఎస్‌సీ ఛైర్మన్‌ సిద్ధార్థ్‌ ముజుందర్‌ కూడా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు