ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి

తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

Published : 24 Apr 2024 03:15 IST

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినతరం చేయాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు

ఈనాడు, దిల్లీ: తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో పెద్దపెద్ద వాగ్దానాలు చేసే పార్టీలు, వాటి అమలుకోసం ఆర్థిక వనరులను ఎలా సమీకరిస్తాయనేది కూడా చెప్పాలని హితవుపలికారు. ప్రజలు కూడా దీనిపై  ప్రశ్నించాలని కోరారు. పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్న సందర్భంగా దిల్లీలోని తెలుగువారు మంగళవారం వెంకయ్యనాయుడిని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు చూడకుండా వాగ్దానాలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నించడం మంచిదికాదన్నారు. రాజకీయాల్లో ఫిరాయింపులు పెరిగిపోవడంపట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.  ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల కోసం బూతులు మాట్లాడటాన్ని సమాజం అంగీకరించకూడదని.. అలాంటి వారిని ప్రజలు తిరస్కరించాలన్నారు. ‘‘చట్టసభల్లో చర్చించి.. విషయాన్ని తేల్చాలి తప్పితే సభను అడ్డుకొని కాదు. నేను రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఫలితాన్ని అందరూ చూశారు. ఈ రోజు కశ్మీర్‌ శాంతియుతంగా మారి పర్యాటకులు, పెట్టుబడులను ఆకర్షిస్తోంది’’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ఆడ్వాణీ ఆశీస్సులు అందుకున్న వెంకయ్యనాయుడు

వెంకయ్యనాయుడు మంగళవారం భాజపా అగ్రనేత ఆడ్వాణీని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. తాను అందుకున్న పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని చూపి ఆశీస్సులు అందుకున్నట్లు ఎక్స్‌లో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని