రక్షణ వ్యయంలో భారత్‌ది నాలుగోస్థానం

ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది.

Published : 24 Apr 2024 05:41 IST

సిప్రి నివేదికలో వెల్లడి

దిల్లీ: ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 91,600 కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో రష్యా నిలిచాయి. స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం (సిప్రి) తాజాగా ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం 2,44,300 కోట్ల డాలర్లుగా ఉందని అందులో తెలిపింది. 2022తో పోలిస్తే ఆ మొత్తం 6.8% అధికమని పేర్కొంది. 2009 తర్వాత ఒక ఏడాదిలో రక్షణ వ్యయం ఇంత ఎక్కువ శాతం పెరగడం ఇదే తొలిసారి. వరుసగా తొమ్మిదో ఏడాది ఈ వ్యయంలో పెరుగుదల నమోదైంది.

సిప్రి నివేదిక ప్రకారం- భారత రక్షణ వ్యయం 2022తో పోలిస్తే 2023లో 4.2% పెరిగింది. 2014తో పోలిస్తే అది 44% అధికం కావడం గమనార్హం. సిబ్బంది, నిర్వహణ వ్యయాల పెరుగుదలే భారత రక్షణ వ్యయం అధికమవుతుండటానికి ప్రధాన కారణం. 2023 నాటి మొత్తం మిలిటరీ బడ్జెట్‌లో వాటిదే మూడొంతులకు పైగా వాటా. చైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో.. సాయుధ బలగాల సమర సన్నద్ధతను బలోపేతం చేసుకునేందుకు భారత్‌ ప్రాధాన్యమిస్తోంది. మిలిటరీ వ్యయంలో దాదాపు 22% బడ్జెట్‌ను రక్షణ రంగ కొనుగోళ్ల కోసం కేటాయిస్తోంది. అందులో 75% వాటా దేశీయ కొనుగోళ్లకే వెళ్తుండటం ఆత్మనిర్భరత సాధన దిశగా భారత్‌ వేస్తున్న అడుగులకు అద్దం పడుతోంది.


నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలివీ..

  • ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఆసియా, ఓషియానా, పశ్చిమాసియాల్లో భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా నిరుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం పెరిగింది.
  • అమెరికా రక్షణ వ్యయం 2022తో పోలిస్తే నిరుడు 2.3% పెరిగింది. 2014తో పోలిస్తే ఆ పెరుగుదల 9.9%గా ఉంది.
  • సైనిక వ్యయంపరంగా ఉక్రెయిన్‌ నిరుడు ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది. 2023లో ఈ రంగంపై అది చేసిన ఖర్చు 6,480 కోట్ల డాలర్లు. రష్యా రక్షణ వ్యయంలో ఇది 59% మాత్రమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని