ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు

పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్‌ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.

Published : 24 Apr 2024 04:08 IST

మోసపూరిత వాణిజ్య ప్రకటనలపై సుప్రీంకోర్టు సీరియస్‌
ఎఫ్‌ఎంసీజీ సంస్థలూ పతంజలి కేసు పరిధిలోకి...
చర్యల నివేదికను సమర్పించాలని మూడు కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఆదేశం

దిల్లీ: పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్‌ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మోసపూరిత ప్రకటనలతో ఉత్పత్తులను విక్రయించాలనుకునే అన్ని సంస్థలపై చర్యలు ఉండాలని, ఏ ఒక్క కంపెనీకో వాటిని పరిమితం చేయటం తమ ఉద్దేశం కాదని జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ అహ్‌సానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం తెలిపింది. డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీస్‌ (అభ్యంతరకర ప్రకటనల నిరోధక) చట్టం, ఔషధాలు-సౌందర్య సాధనాల చట్టం, వినియోగదారుల పరిరక్షణ చట్టం నిబంధనలను అనుసరించి ఆ తరహా వాణిజ్య ప్రకటనలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ముఖ్యంగా చిన్నారులు, వయోధికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఉత్పత్తులపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మోసపూరిత వాణిజ్య ప్రకటనల నివారణకు కేంద్ర ప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ, సమాచార-ప్రసార శాఖ, సమాచార సాంకేతిక(ఐటీ)శాఖ ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలేమిటో వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని మంగళవారం ఆదేశించింది. ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం(1945)లోని 170వ నిబంధన కింద చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఔషధ నియంత్రణ అధికారులకు 2023 ఆగస్టులో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ లేఖ రాయడంపై కేంద్ర ప్రభుత్వ వివరణనూ ధర్మాసనం కోరింది. పతంజలి కేసులో పిటిషనర్‌ అయిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)కూ ధర్మాసనం చురకలు వేసింది. ఆ సంస్థ సభ్యుల ప్రవర్తనను సరిచేసుకోవాలని హితవుపలికింది. ఐఎంఏ సభ్యులైన వైద్యులు కొందరు చికిత్సల కోసం అత్యంత ఖరీదైన ఔషధాలను రాస్తున్నారని, కొన్ని అనైతిక చర్యలకూ పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని హెచ్చరించింది. మోసపూరిత వాణిజ్య ప్రకటనల కేసులో కోర్టుకు సహాయపడేందుకు గాను ప్రస్తుత వ్యాజ్యంలో భాగస్వామికావాలని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)ను ధర్మాసనం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని