తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ

తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది.

Published : 24 Apr 2024 05:41 IST

దిల్లీ: తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్‌ పెరిగినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 43.5 డిగ్రీల సెల్సియస్‌, కర్నూలులో 43.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదుకాగా, తమిళనాడులోని సేలంలో 42.3 డిగ్రీల సెల్సియస్‌, ఈరోడ్‌లో 42 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఈ నెలలో ఇలా వేడిగాలుల విజృంభణ ఇది రెండోసారి. ఒడిశాలో ఏప్రిల్‌ 15 నుంచి, పశ్చిమబెంగాల్‌లో 17 నుంచి వేడిగాలులు ఉద్ధృతం అయ్యాయి. తూర్పు, దక్షిణ భారతాల్లో ఈ వేడిగాలులు మరో అయిదు రోజులు ఇలాగే ఉంటాయని ఐఎండీ తెలిపింది. రాబోయే నాలుగైదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు వాయవ్య, తూర్పు భారతాల్లో 2 - 4 డిగ్రీల సెల్సియస్‌ మేర, మహారాష్ట్రలో 3 - 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశముంది. పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, బిహార్‌, సిక్కిం, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మరో అయిదు రోజులు వేడిగాలుల నుంచి తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. తీరప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, అస్సాం, మేఘాలయ, త్రిపుర, బిహార్‌ రాష్ట్రాల్లో గాలిలో తేమ అధికంగా ఉండి ప్రజలు అసౌకర్యానికి గురయ్యే అవకాశముంది. ఒడిశాలో ఏప్రిల్‌ 25 - 27 తేదీల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటాయి.

అత్యంత విపత్తు ప్రభావిత ప్రాంతం ‘ఆసియా’

వాతావరణ తీవ్రత, నీటి సంబంధిత కష్టాలు 2023 ఏడాదిలోనూ కొనసాగడంతో ఆసియా ఖండము ప్రపంచంలో అత్యధిక విపత్తు ప్రభావిత ప్రాంతంగా నిలిచినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తాజా నివేదిక పేర్కొంది. వరదలు, తుపానులు అత్యధిక ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి దారితీశాయని.. వేడిగాలుల తీవ్రత బాగా పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. వాయవ్య పసిఫిక్‌ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆర్కిటిక్‌ మహాసముద్రం కూడా సముద్ర ఉష్ణ తరంగాలను ఎదుర్కొంది. ఆసియాలోని పలు దేశాలకు అత్యధిక ఉష్ణోగ్రతలను చవిచూసిన ఏడాదిగా 2023 మిగిలింది. కరవు, వేడి తరంగాలు, వరదలు, తుపానుల పరంగానూ ఆయా దేశాలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాయి. వాతావరణ మార్పులు వీటి తీవ్రతను మరింత పెంచాయి. మన సమాజాలు, ఆర్థికవ్యవస్థలు, అన్నిటికంటే ముఖ్యంగా మానవ జీవితాలు, పర్యావరణంపై ఇవి మిక్కిలి ప్రభావం చూపినట్లు డబ్ల్యూఎంవో ప్రధాన కార్యదర్శి సెలెస్ట్‌ సాలో తెలిపారు.పెరుగుతున్న వాతావరణ మార్పుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనలేని స్థితిలో ఉన్న ఆసియా ప్రాంత దుర్బలత్వాన్ని ఈ నివేదిక బహిర్గతం చేసిందని వాతావరణ ఉద్యమకారుడు హర్జీత్‌సింగ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని