ఎన్నికలను మేం నియంత్రించలేం

దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.

Published : 25 Apr 2024 04:05 IST

ఈసీ పనితీరునూ నిర్దేశించలేం
‘వీవీప్యాట్‌’ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిల్లీ: దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. ఒక రాజ్యాంగ సంస్థగా అటువంటిదే అయిన మరో సంస్థ విధుల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)లోని ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఈ కేసులో తీర్పును రిజర్వు చేసింది. జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం బుధవారమే తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే, కొన్ని సందేహాలు ఉన్నందున స్పష్టత కోరుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది.

ఈవీఎంలోని మైక్రోకంట్రోలర్‌ గురించి, దానిని రీప్రోగ్రామ్‌ చేయటానికి సంబంధించి ఆరా తీసింది. కోర్టుకు హాజరైన సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నీతీశ్‌ కుమార్‌ వ్యాస్‌ వివరణ ఇచ్చారు. ఈవీఎంలోని మూడు యూనిట్ల(బాలెటింగ్‌ యూనిట్‌, వీవీప్యాట్‌, కంట్రోల్‌ యూనిట్‌)కు వాటి సొంత మైక్రోకంట్రోలర్స్‌ ఉంటాయని, తయారీ సమయంలోనే, అదీ ఒకసారి మాత్రమే ప్రోగ్రామ్‌ చేయగలరని తెలిపారు. అయితే, ఈ సమాధానాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తప్పుపట్టారు. దీనిలో సగం మాత్రమే నిజం ఉందన్నారు. మైక్రోకంట్రోలర్స్‌కు ఫ్లాష్‌ మెమొరీ ఉంటుంది కనుక రీప్రోగ్రామ్‌  సాధ్యమేనంటూ ఒక ప్రైవేటు సంస్థ నివేదికను ఉటంకించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ...ఫ్లాష్‌ మెమొరీ చాలా తక్కువగా ఉంటుందని, 1024 చిహ్నాలను మాత్రమే స్టోర్‌ చేయగలదంటూ ఎన్నికల సంఘం వెల్లడించిన సాంకేతిక వివరాలను విశ్వసిస్తున్నట్లు తెలిపింది.

ఈవీఎం సోర్స్‌ కోడ్‌కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. పారదర్శకత కోసం దాన్ని బయటపెట్టాలని కోరగా ధర్మాసనం వ్యతిరేకించింది. ‘సోర్స్‌ కోడ్‌ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే దుర్వినియోగపరిచే అవకాశముంది’ అని వ్యాఖ్యానించింది. ‘‘మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది. ఈవీఎంలను అనుమానించే మీ (పిటిషనర్ల) ఆలోచనా ధోరణిని మేం మార్చలేం. కేవలం సంశయాలను ఆధారం చేసుకుని ఉత్తర్వులు జారీ చేయలేం. ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ సంస్థ. దాని పనితీరును మేం నిర్దేశించలేం. ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది.

ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు ఈవీఎంలను ర్యాండమ్‌గా ఎంపిక చేసి వాటిలోని ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చుతూ లెక్కిస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని