హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్‌ సోరెన్‌

తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Published : 25 Apr 2024 06:43 IST

దిల్లీ: తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నగదు అక్రమ చలామణి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోరెన్‌ను అరెస్టు చేసింది. దీనిపై హైకోర్టు ఫిబ్రవరి 28న తన తీర్పును రిజర్వు చేసిందని అప్పటి నుంచి ఎటువంటి నిర్ణయాన్ని వెలువరించలేదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనానికి సోరెన్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ విన్నవించారు. అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 2న తాము సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టుకు వెళ్లాలని అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం సూచించిందని వివరించారు. ఆ ప్రకారం ఫిబ్రవరి 4న ఉన్నత న్యాయస్థానానికి వెళ్లామన్నారు. చివరకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో విచారణ జరిపిన కోర్టు ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలిపారు. ఈ పరిస్థితిపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించినా ఎటువంటి ఫలితం కనిపించలేదని సిబల్‌ ధర్మాసనానికి తెలిపారు. ఈ క్రమంలో పిటిషన్‌దారైన హేమంత్‌ సోరెన్‌ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇలాగే ఉంటే ఎన్నికలు కూడా అయిపోతాయని, అప్పుడు మేం ఇంకెక్కడికి వెళ్లాలి? అంటూ ఆయన వాపోయారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ ఖన్నా.. వివరాలన్నీ సమర్పించాలని, రేపో, ఎల్లుండో కేసు లిస్టింగ్‌ తేదీని పొందుతారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు