విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని

ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 25 Apr 2024 06:43 IST

దిల్లీ: ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తుల స్థితిస్థాపక మౌలిక సదుపాయాలపై బుధవారం ఏర్పాటుచేసిన 6వ అంతర్జాతీయ సదస్సులో రికార్డు చేసిన ప్రధాని ప్రసంగ వీడియోను ప్రదర్శించారు. ఇందులో మోదీ మాట్లాడుతూ..‘‘చక్కటి భవిష్యత్తు కోసం దేశాలు విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలి. కొత్త మౌలిక సదుపాయాల కల్పనలో స్థితిస్థాపకత అవసరం. విపత్తుల తర్వాత పునర్నిర్మాణంలో కూడా ఇది భాగం కావాలి. భూకంపాలు వేలాదిమందిని నిరాశ్రయులుగా చేస్తున్నాయి. ప్రకృతి వైరీతాల్యలతో నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థలు దెబ్బతిని ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో విద్యుత్తు కర్మాగారాలు దెబ్బతింటున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసే ఈ పరిణమాలన్నీ మానవుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దుర్బలమైన చిన్న దేశాలకు మనం అండగా నిలవాలి. సీడీఆర్‌ఐ (విపత్తుల స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి) ఇపుడు దక్షిణాది ప్రపంచంపై కూడా దృష్టి సారించడం సంతోషం కలిగించే విషయం’’ అన్నారు. ఈ పరిస్థితులను ప్రపంచం మూకుమ్మడిగా ఎదుర్కొనేందుకు ఇటువంటి సదస్సులు దోహదపడతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని